నిందితుల విచారణపై వెలువడనున్న తుది తీర్పు

దిశ కేసులో నిందితుల కస్టడీ పిటీషన్‌పై కాసేపట్లో తుదినిర్ణయం ప్రకటించనుంది షాద్‌నగర్ కోర్టు. శాంతి భద్రతల దృష్ట్యా నిందితులను చర్లపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, చెన్నకేశవులు, జొల్లు నవీన్‌ను..10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. వీళ్ల అరాచకంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలంటే ఆ మాత్రం సమయం కావాలంటున్నారు. ఇప్పటికే నిందితులకు నోటీసులు జారీ చేసి వారి సంతకాలు తీసుకున్నారు షాద్‌నగర్ పోలీసులు. సంతకాల పేపర్లను సైతం కోర్టుకు సమర్పించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా విచారణకు సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు.
ఈ కేసులో నిందితుల తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో.. కోర్టు ద్వారా న్యాయవాదులను నియమించుకుంటారా అనేది తెలుసుకునేందుకు ధర్మాసనం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం కస్టడీ పిటీషన్‌పై నిర్ణయం వెలువడితే.. కట్టుదిట్టమైన భద్రత మధ్య వీళ్లను షాద్‌నగర్ తరలిస్తారు. కుటుంబ సభ్యులు కూడా వీళ్లను కలిసేందుకు కానీ, కనీసం చూసేందుకు కానీ ఇష్టపడడం లేనందున.. నిందితుల తరపున అడ్వొకేట్‌ను ఏర్పాటు చేయడంపై ఏం జరుగుతుందన్నది త్వరలో తెలియనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com