ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీం

కేంద్ర మాజీ హోం, ఆర్థిక శాఖల మంత్రి చిదంబరానికి.. INX మీడియా కేసులో గొప్ప ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ భానుమతి, బోపన్న, హృషికేష్ రాయ్‌తో కూడిన ధర్మాసనం.. కండిషన్లతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో.. 106 రోజుల జైలు జీవితం తర్వాత చిద్దూ బయటకు రాబోతున్నారు.
రెండు లక్షల రూపాయల పూచీకత్తుతోపాటు.. పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని చిదంబరాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాక్షాలను నీరుగార్చడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటి పనులు చేయకూడదని న్యాయస్థానం తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని నిబంధనలు పెట్టింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని స్పష్టంచేసింది.
2017 మేలో చిదంబరంపై అవినీతి కేసు నమోదు చేసింది సీబీఐ. అదే ఏడాది చివర్లో ఈడీ సైతం మనీ లాండరింగ్ కేసు పెట్టింది. గత ఆగస్టు 21న చిదంబరాన్ని ఈ కేసులో సీబీఐ అరెస్టు చేయగా, రెండు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే.. అక్టోబర్ 16న మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. దీంతో అప్పట్లో ఆయన బయటకు రాలేకపోయారు. మరోవైపు.. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలుకు పంపారు. ఇన్నాళ్లకు కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో.. ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అటు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో బెయిల్‌పై బయటకు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com