దిశ ఘటన ఎంతో బాధ కలిగించింది: హరీష్‌రావు

దిశ ఘటన ఎంతో బాధ కలిగించిందన్నారు మంత్రి హరీష్‌రావు. మగ పిల్లలకు సంస్కారంతో కూడిన విద్య అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హరీష్‌రావు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్‌ వారి సహకారంతో విద్యార్థినులకు ఎనీమియా టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థినులందరికీ టిఫిన్‌-ట్యూషన్‌ కార్యక్రమం ఏర్పాటు చేసి టెన్త్‌ ఫలితాల్లో సిద్దిపేటను రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దిశ అంశాన్ని మంత్రి హరీష్‌రావు ప్రస్తావించారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందన్నారు. తల్లిదండ్రుల్లో మార్పురావాలని, మగ పిల్లలకు సంస్కారంతో కూడిన విద్య అందించాలని సూచించారు.

అంతకు ముందు స్థానిక ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. దివ్యాంగులకు ట్రై సైకిల్స్‌ పంపిణీ చేశారు. దివ్యాంగుల కోసం నిత్యం కృషి చేయాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు. వికలాంగులుగా పుట్టడం నేరం కాదని, వారిని మానవత్వంతో చూడాలని అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను హరీష్‌రావు వివరించారు. త్వరలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు.

ఇక సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో సేంద్రియ, వ్యవసాయ రైతుల సమ్మేళనంలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. రసాయనాలు లేని ఆహారోత్పత్తుల కోసం రూపొందించిన సిద్దిపేట ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. రైతుల వివరాలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు ఈ వెబ్‌సైట్‌లో లభ్యం కానున్నాయి. దళారీల ప్రమేయం లేకుండా రైతుకు లాభం చేకూర్చేందుకు వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసినట్లు హరీష్‌రావు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు మంత్రి ఆర్గానిక్‌ వ్యవసాయ పనిముట్లను అంజేశారు.

Tags

Next Story