దిశ ఘటనపై కొనసాగుతున్న నిరసనలు

దిశ ఘటనపై కొనసాగుతున్న నిరసనలు

disha

దిశ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితులను పదిరోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పోలీసులు నిందితులను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. విచారణ పేరుతో సాగదీయకుండా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రజలంతా ముక్త కంఠంతో నినదిస్తున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసు కస్టడీకి అప్పగించింది షాద్‌నగర్‌ కోర్టు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందని.. నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దిశ మొబైల్‌ ఇంకా రికవరీ చేయలేదని.. నిందితుల వాంగ్మూలం కూడా రికార్డు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు నలుగురు నిందితులను పదిరోజుల కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. మరోవైపు నిందితులను చర్లపల్లి జైలుకు తరలిస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఘటనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులను కస్టడీకి తరలించే సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జస్టిస్ ఫర్ దిశ అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తెలుగు సమాజం ఒక్కటైంది. ముక్తకంఠంతో నినదిస్తోంది. దిశను అత్యాచారం చేసి హత్య చేసిన మృగాలను ఉరి తీయాలని డిమాండ్ చేస్తోంది. విచారణ పేరుతో సాగదీయవద్దని హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మొన్నటి వరకు తమ గ్రామంలో మూగజీవాలకు వైద్య సేవలు అందించిన యువ డాక్టర్‌.. మానవ మృగాల చేతిలో బలైపోవడాన్ని ఆమె పనిచేసిన కొల్లూరు గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. దిశను హత్య చేసిన చోటే నిందితులను కాల్పి చంపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇలాంటి దారుణ హత్యలు మళ్లీ జరగకూడదని విద్యార్థులు నినదించారు. రేపిస్టులను అత్యంత కఠినంగా శిక్షించే చట్టాలను తీసుకురావాలని వరంగల్‌ విద్యార్థులు కేంద్రాన్ని కోరారు. కొత్తగూడెంలో మహిళా సంఘాలు, విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ద్వారా త్వరగా విచారణ పూర్తి చేసి ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలందరూ ఎమర్జెన్సీ నెంబర్లపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

కరీంనగర్ జిల్లా ధర్మపురిలో విద్యార్థులు, మహిళలు మానవహారం చేపట్టారు. భారీ ర్యాలీ చేపట్టారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ నినాదాలు చేశారు. దారుణంగా హత్య చేసిన వారందరని బహిరంగంగా ఉరితీయాలంటూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద ఆధ్వర్యంలో.. పఠాన్‌చెరులో భారీ రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో మద్యపానాన్నిపూర్తిగా నిషేధించాలని ఆమె డిమాండ్ చేశారు. అశ్లీల వెబ్‌సైట్లను కూడా తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

డాక్టర్‌ దారుణ హత్యకు నిరసనగా.. తిరుపతిలో పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఒంగోలు, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

దేశంలో కాదు.. విదేశాల్లో కూడా దిశ ఘటనను ముక్తఖంఠంతో ఖండిస్తున్నారు. అమెరికాలోని ప్రవాస తెలుగువారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. DFW కమ్యూనిటీకి చెందిన ఎన్నారైలు డాలస్ లో జోయ్ ఈవెంట్ సెంటర్ లో దిశ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్యురాలి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు.

Tags

Read MoreRead Less
Next Story