దిశ కేసు సత్వర విచారణకు ఏర్పాటైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు

దిశ కేసు సత్వర విచారణకు ఏర్పాటైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు

disha-accused

డాక్టర్‌ దిశ హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వీలైనంత త్వరగా నిందితులకు శిక్షలు అమలు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటైంది. హైకోర్టు సూచనలతో మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ అడిషనల్‌ సెషన్స్‌ జిల్లా కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టుకు స్పెషల్ కోర్టు హోదా ఇస్తూ తెలంగాణ న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దిశ కేసును అత్యంత వేగంగా విచారించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు హైకోర్టుకు ప్రభుత్వం తరపున లా సెక్రటరీ సంతోష్‌రెడ్డి లేఖ రాశారు. స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడంతోపాటు.. నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనకు హైకోర్టు ఓకే చెప్పింది. దీంతో మహబూబ్ నగర్ మొదటి అదనపు సెషన్స్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్‌ కోర్టుగా ప్రకటించారు.

పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశాక విచారణ మొదలవుతుంది. మొదట నిందితులపై మోపిన నేరాభియోగాలు పరిశీలిస్తారు. నేరగాళ్లు ఆర్థికస్థోమత లేని నిందితులైతే ప్రభుత్వం తరపున లాయర్లను నియమించుకునేందుకు అనుమతిస్తారు. సాక్షుల సంఖ్యను బట్టి విచారణ ఎన్ని రోజుల్లో పూర్తవుతుందన్నది తేలనుంది. ఇప్పటి వరకు ఈ కేసులో లారీ యజమాని, టోల్‌గేట్, పెట్రోల్‌ బంక్ సిబ్బంది, దిశ చెల్లెలు, తల్లిదండ్రులను సాక్షులుగా చేర్చారు. విచారణ తేదీలు ఖరారయ్యాక సాక్షులకు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.

ఇటీవల వరంగల్‌లో 9నెలల పసిపాపపై జరిగిన ఘోరం కేసులోనూ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేశారు. దీంతో కేవలం 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. ఇదే తరహాలో దిశ కేసులోనూ సత్వర తీర్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దిశ కేసులో పూర్తి ఆధారాలు సమర్పించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లారీ నుంచి సేకరించిన రక్తపు మరకలు, వెంట్రుకలను FSLకు పంపించారు. ప్రత్యక్ష సాక్షలెవరూ లేకపోవడం వల్ల ఈ కేసులో FSL రిపోర్టే చాలా కీలకంగా మారనుంది. ఇక సీసీ టీవీ ఫుటేజ్‌ కూడా మరో కీలక ఆధారం కానుంది. ఆ నలుగురికి ఉరిశిక్ష పడేలా పక్కా సాక్షాలు సమర్పించాలని పోలీసులు యోచిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్‌ కోర్టులో రోజువారీగా విచారణ జరగనుంది. అయితే తుదితీర్పు వచ్చేందుకు కనీసం నెలరోజులైనా సమయం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

అటు ఈ కేసులో నిందితుల తరపున ఎవరూ వాదించకూడదని మహబూబ్‌నగర్ జిల్లా లాయర్లు ఇప్పటికే నిర్ణయించారు. దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, పార్లమెంట్‌నూ కూడా కుదిపేయడంతో.. ఈ కేసును అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అటు కేంద్రం కూడా ఆ నలుగురికి క్యాపిటల్ పనిష్మెంట్ పడేలా చూస్తామని ఇప్పటికే చెప్పింది. అటు నలుగురు నిందితుల్ని వారం రోజులు పోలీస్‌ కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది షాద్‌నగర్‌ కోర్టు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు నుంచి నలుగురిని గురువారం అదుపులోకి తీసుకోనున్నారు. ఈనెల 11 వరకు వీరు పోలీసుల కస్టడీలోనే ఉంటారు. పోలీసులు పది రోజులు కస్టడీ కోరినప్పటికీ న్యాయస్థానం మాత్రం వారం రోజులకే అనుమతి ఇచ్చింది. అయితే కేసు తీవ్రత, ప్రజాగ్రహం దృష్ట్యా నిందితుల్ని ఎక్కడ విచారిస్తారన్నది పోలీసులు సీక్రెట్‌గా ఉంచుతున్నారు.

Tags

Next Story