దిశ కేసులో నిందితులను ఉరితీయాలంటూ కొనసాగుతోన్న నిరసనలు

దిశ కేసులో నిందితులను ఉరితీయాలంటూ కొనసాగుతోన్న నిరసనలు

disha

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను ఉరితీయాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. దిశ కేసులో నిందితులకు కఠిన శిక్షాలు పడాలంటూ విశాఖ జీవీయంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన నేతలు నిరసన తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ప్రభుత్వం నియంత్రించాలని కోరారు. అటు తిరుపతిలో విద్యార్ధులు, విద్యార్థి సంఘాలు నాలుగుకాళ్ల మండపం వద్ద మానవహారం నిర్వహించారు.

మహిళలపై అత్యాచారాలకు పాల్పడే దుండగులను కఠినంగా శిక్షించాలంటూ పీడీయస్‌యూ ఆధ్వర్యంలో సిరిసిల్లలో విద్యార్థినీలు భారీ ర్యాలీ చేపట్టారు. నిర్భయ లాంటి చట్టాలు తెచ్చినా మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపానం వలనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.

దిశ హత్యకేసు నిందితులను తక్షణమే ఉరి తీయాలంటూ శంషాబాద్‌లో విద్యార్థులు కదం తొక్కారు. నిందితులను జైలులో పెట్టి మేపకుండా తమకు అప్పగిస్తే తగిన శాస్తి చేస్తామంటూ నినదించారు. మరో వైపు విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తతకు దారితీసింది.

అమ్మాయిలను చూడాలంటే పోకిరీలకు దడపుట్టాలని అన్నారు వరంగల్ ఎసీపీ సారంగపాణి. నగరంలో పోచమ్మ మైదాన్‌ ఎస్‌ఆర్‌ మహిళా కళాశాలలో విద్యార్థినిలకు డయల్ 100పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపదలో ఉన్నప్పుడు 100కి కాల్ చేస్తే తక్షణమే స్పందిస్తామని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో డయల్ 100 , షీ టీం ప్రాధాన్యత, ఉపయోగించే విధానాలపై కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు పోలీసులు అవగాహన నిర్వహించారు. మహిళలు , విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరిలను అరెస్ట్ చేసి చట్టం ప్రకారం శిక్షిస్తామని తెలిపారు.

అవసరమైన సమయాల్లో డయల్ 100 కీలక పాత్ర పోషిస్తుందని జనగామ జిల్లా పాలకుర్తిలో విద్యార్థులకు పోలీసులు వివరించారు. పాఠశాలలో విద్యార్థినిలకు డయల్ 100పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. దిశ తన సోదరితో మాట్లాడిన సమయంలో 100 నెంబర్‌కి సంప్రదించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని చెప్పారు .

దిశ ఘటన తర్వాత డయల్‌ 100కి మహిళలు, యువతులు కాల్‌ చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. షీ టీం, పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story