పదేళ్ల తర్వాత.. సేమ్ ఇన్సిడెంట్‌ రిపీట్‌..

పదేళ్ల తర్వాత.. సేమ్ ఇన్సిడెంట్‌ రిపీట్‌..

police

దిశ ఘటనతో దేశవ్యాప్తంగా జనం రగిలిపోయారు. ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఊరూవాడా ఆందోళనలకు దిగారు. మీ వల్ల కాకపోతే మాకు అప్పగించండి... వాళ్లను చంపేస్తామంటూ నినాదాలు చేశారు. దిశను దారుణంగా హత్యచేసిన వారిని నిల్చోబెట్టి కాల్చేయాలన్న కసి జనంలో కనిపించింది. వాళ్లను నిర్దాక్షిణ్యంగా ఉరివేయాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు.

దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా వాళ్లు అనుకున్నదే జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని ఇలా ఎన్‌కౌంటర్‌ చేస్తేనే ... మరో మృగం ధైర్యం చేయదని భావిస్తున్నారు. ఇలాంటి ఇన్‌స్టంట్‌ శిక్షలు పడ్డప్పుడే రేపిస్టులకు భయం ఉంటుందంటున్నారు.

నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో జనం దృష్టిలో పోలీసులు ఒక్కసారిగా హీరోలుగా మారిపోయారు. ఇన్నాళ్లు పోలీసులంటే ఒక మోస్తరు గౌరవంలేనివాళ్లు కూడా... ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నారు. పోలీసుల యాక్షన్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కన్నుమిన్ను కానరాకుండా అత్యాచారాలు చేసేవారికి ఇదే సరైన శిక్ష అంటూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

2008లో ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లాలో జరిగిన ఘటనను జనం గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు జిల్లా ఎస్పీగా సజ్జనార్‌ ఉన్న సమయంలో జరిగిన యాసిడ్ దాడి ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌ చేశారు. దిశ హత్యకేసులోనూ అదే జరిగింది. ఇప్పుడు సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్నారు.. రెండు ఘటనల్లో ఆయనే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

2008 డిసెంబర్‌లో వరంగల్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న స్వప్నిక తన స్నేహితురాలు ప్రణీతతో కలిసి స్కూటీపై కాలేజీకి వెళుతోంది. అదే సమయంలో మార్గ మధ్యలో మాటు వేసిన శ్రీనివాస్ అనే యువకుడు స్వప్నికపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్వప్నికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉండటంతో.. సికింద్రబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్సపొందుతూ ఆమె చనిపోయింది. స్కూటీ వెనుక కూర్చొన్న ప్రణీతకు తీవ్ర గాయాలు అయ్యాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడితో పాటూ అతడికి సహకరించిన స్నేహితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల్ని ఘటన జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లిన సమయంలో.. పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్ చేసేశారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు చనిపోయారు. ఇప్పుడు తాజాగా చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో నిందితులు చనిపోవడంతో... జనం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story