ఉప ఎన్నికల ఫలితాలు: సీఎం సీటుకు ఢోకాలేదు!

కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వానికి ఇక ఢోకా లేనట్లే! 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో 11 స్థానాల్లో బీజేపీ విజయదిశగా సాగుతోంది. దీంతో ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ రెండింటిలోనూ, జేడీఎస్ ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉన్నాయి. హిరెకెరూరు, చిక్ బళ్లాపూర్, మహాలక్ష్మీ లేఅవుట్, కృష్ణరాజు పేట, కేఆర్ పురం, కాగ్వాడ్, గోకక్‌లో బీజేపీ అభ్యర్ధులు ముందంజ ఉండగా, శివాజీనగర్, హున్సూర్‌లో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది.
కర్ణాటకలో 17 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరిగాయి. రెండు స్థానాలకు ఇతర కారణాలతో ఉప ఎన్నికలను నిర్వహించలేదు. 15 స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరిగాయి. 224 స్థానాలున్న శాసన సభలో బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో ఏకైక అతి పెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల బీజేపీ ప్రభుత్వం మనుగడ కొనసాగాలంటే అదనంగా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. అయితే.. ప్రస్తుత ఫలితాల్లో 11 స్థానాలతో బీజేపీ ముందంజ ఉంది. దీంతో యడ్యూరప్ప సర్కారుకు ఎలాంటి డోకా లేనట్లే! కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి. మరో మూడూన్నరేళ్ల పాటు స్థిరమైన సర్కారు కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.
అటు కర్ణాటక ఉపఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డికే. శివకుమార్. సాధారణ ఎన్నికలు వేరు, ఉపఎన్నికల వేరన్న ఆయన. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. రాజకీయం అనేది వ్యవసాయం లాంటిదన్న డికే శివకుమార్... మంచి ఫలితాలు కోసం మరింత కష్టపడాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com