65వ వసంతంలోకి అడుగుపెట్టిన సాగర్ ప్రాజెక్ట్


దేశంలోనే భారీ బహుళార్ధసార్థక ప్రాజెక్ట్‌గా.. ఆధునిక దేవాలయంగా పేరుగాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 65వ వసంతంలోకి అడుగుపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, హైదరాబాద్ సహా వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తోంది. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబర్ 10న నాగార్జునసాగర్ శంకుస్థాపన జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణానికి 12 ఏళ్లు పట్టగా... దాదాపు 45 వేల మంది కార్మికులు చమటోడ్చారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో 1967 ఆగస్టు 4న కుడికాలువ ద్వారా నీటి విడుదల చేశారు. 1974లో ప్రాజెక్ట్ క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశారు. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఎడమకాల్వకు నీరు విడుదల చేశారు.
ప్రాజెక్ట్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో 11 వందల 10 మెగావాట్ల లెక్కన ఏడాదిలో 120 మిలియన్ యూనిట్ల పవర్ ఉత్పత్తి అవుతుంది. కుడి కాలువ జల విద్యుత్ కేంద్రం నుంచి ఏటా 292 మిలియన్ యూనిట్లు, ఎడమ కాలువ విద్యుత్ కేంద్రం నుంచి 127 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
నాగార్జున సాగర్ డ్యామ్‌లో ఎన్నో విశేషాలున్నాయి. ఎడమవైపు కట్ట పొడవు 8 వేల 4 వందల అడుగులు. కుడివైపు కట్ట పొడవు 2 వేల 8 వందల అడుగులుగా ఉంది. మొత్తం ప్రాజెక్ట్ ఆనకట్ట పొడవు 15 వేల 9 వందల 56 అడుగులు. ఒక్కో క్రస్ట్ గేటు ఎత్తు 44 అడుగులు కాగా.. వెడల్పు 45 అడుగులు. సాగర్ గరిష్టనీటి మట్టం 590 అడుగులు.. కనీస నీటి మట్టం 510 అడుగులు. సాగర్ దగ్గర సముద్ర నీటి మట్టం 246 అడుగులు. రిజర్వాయర్ వైశాల్యం నూట పది చదరపు మైళ్లు.
సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అప్పట్లో 73 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. మొత్తం 74 కోట్లు కేటాయిస్తే.. కోటి రూపాయలు మిగులుగా కేంద్రానికి చూపించడం ఓ రికార్డ్‌గా చెప్తారు. నిర్మాణ సమయంలో సుమారు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. వారందరినీ సాగర్ శివార్లలోని ఓ ప్రాంతంలో పూడ్చారని చెబుతారు. అందుకే ఆ ప్రాంతానికి దెయ్యాల గండి అని పేరు వచ్చిందంటారు. పురావస్తు తవ్వకాల్లో బుద్ధుడి శరీరంలోని ఓ భాగం లభించగా దాన్ని నాగార్జున కొండ మ్యూజియంలో భద్రపరిచారు.
డ్యామ్ నిర్మాణ చరిత్ర, ప్రాజెక్ట్‌తో రైతులకు ఎన్ని ప్రయోజనాలు ఎంతో ఘనంగా కనిపిస్తున్నా కొన్ని సమస్యలు లేకపోలేదు. నిపుణులైన అధికారులు, సిబ్బంది లేకపోవడంతోపాటు డ్యామ్ నిర్వహణ లోపాలు బయటపడుతున్నాయని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

