పౌరసత్వ సవరణ బిల్లుకు అర్థరాత్రి లోక్‌సభ ఆమోదం


అధికార, విపక్షాల వాగ్వాదాల మధ్య పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సుదీర్గంగా జరిగిన చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 311, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు తీసుకురావడం వెనుక ఎలాంటి రాజకీయ అజెండా లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. దేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి నష్టం కలుగదని స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభ వేదికగా కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటుచేసుకుంది . పౌరసత్వ బిల్లుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. శరణార్థులకు సరైన గౌరవం దక్కాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ఈ బిల్లు ఆర్టికల్ 14కు వ్యతిరేకం కాదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మతాల ఆధారంగా దేశాన్ని విభజించిందని విమర్శించారు. ఈ బిల్లు కారణంగా దేశంలోని ఏ ఒక్క పౌరుడూ తన హక్కులకు దూరం కారని స్పష్టం చేశారు.
అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. అసలు రెండు దేశాల సిద్ధాంతం అనేదానికి 1935లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన హిందూ మహాసభ సమావేశాల్లోనే సావర్కర్ పునాది వేశారని.. కాంగ్రెస్ పార్టీ కాదని కౌంటర్ ఇచ్చారు.
బిల్లుపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలోఎంఐఎం చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. బిల్లు ప్రతులను సభలోనే చించివేసి నిరసన తెలిపారు. ఇది దేశాన్ని నిలువునా విభజించే ప్రయత్నమని ఆరోపించారు.
శ్రీలంక తమిళీయులకు పౌరసత్వం ఉన్నదని అమిత్ షా తెలిపారు. కాశ్మీర్, అక్కడి ప్రజలు కూడా భారత్‌లో అంతర్భాగమేనని ఆయన నొక్కి చెప్పారు. ఈ బిల్లు పట్ల ఈశాన్య రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విదేశాల నుంచి దేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనారిటీలు హక్కులు పొందుతారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర జాబితాను తాము అధికారంలో ఉన్నంత వరకు పశ్చిమబెంగాల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ఎన్సార్సీని ప్రవేశపెడుతారన్న వార్తలతో కలతచెంది రాష్ట్రంలో 30 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

