ఏపీ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లుకు ఏపీ దిశ యాక్ట్‌గా పేరు పెట్టిన సర్కార్

ఏపీ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది.. మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లుకు ఏపీ దిశ యాక్ట్‌గా పేరు పెట్టింది. ఇటీవల దిశ సహా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఘటనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ లా చట్టంతోపాటు స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనెస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019కి కేబినెట్ ఓకే చెప్పింది. ఈ చట్టం ప్రకారం యాసిడ్ దాడులు, అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్షలు పడనున్నాయి. అలాగే చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడినా మరణ శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఈ సవరణ బిల్లుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడింది. దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకునే పట్టుదలతో ప్రభుత్వం ఉంది.
నిర్ధారించే ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వచ్చేలా చట్టంలో మార్పులు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు విచారణ సమయం నాలుగు నెలలు ఉండగా.. దాన్ని 21రోజులకు కుదిస్తూ బిల్లును రూపకల్పన చేసింది. బిల్లులో పొందుపరచిన అంశాల ప్రకారం వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. 14రోజుల్లో విచారణ పూర్తిచేసి మొత్తం 21 రోజుల్లో జడ్జిమెంట్ వచ్చేలా ప్రభుత్వం మార్పులు చేసింది. మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు, సోషల్ మీడియా ద్వారా మహిళలపై వేధింపులు వంటి నేరాల విచారణ కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడితే కఠిన చర్యలుంటాయి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 (ఈ) కింద చర్యలు తీసుకునేలా బిల్లులో కీలక సవరణలు చేసింది ప్రభుత్వం. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష పడుతుంది. అలాగే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. పోక్సో చట్టం కింద ఇప్పటి వరకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకే జైలు శిక్ష పడే అవకాశం ఉండగా.. నేర తీవ్రతను బట్టి పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకు శిక్ష పడుతుంటే.. తీవ్ర మరింత అధికంగా ఉంటే 14 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com