మొదటి బస్సు నుంచే పెంచిన ఛార్జీలు వసూలు

మొదటి బస్సు నుంచే పెంచిన ఛార్జీలు వసూలు
X

apsrtc

ఏపీలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. ఇవాళ డిపోల నుంచి వేకువ జామున బయటకు వచ్చే మొదటి బస్సు నుంచే పెంచిన ఛార్జీలు వసూలు చేయడం మొదలైంది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచారు..వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు చార్జీ పెంపు ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది. అటు విద్యార్ధుల పాస్‌ల పైనా ఆర్టీసీ వడ్డించింది.

సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీల పెంపుదల లేదని ఆర్టీసీ తెలిపింది. పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలు.. అనగా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపు ఉండదు. తదుపరి 75 కిలోమీటర్ల వరకు 5 రూపాయలు పెంచారు..డీజిల్‌ ధరలు గత నాలుగేళ్లలో 49 నుంచి 70కి పెరిగాయని ఆర్టీసీ వెల్లడించింది. ఇంధన ధరల

పెరుగుదల వల్ల సంస్థపై ఏటా 630 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపింది. విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల ఏటా మరో 650 కోట్లు ఖర్చవుతున్నాయి..ఈ నష్టాలను భర్తీ చేసేందుకే టికెట్ రేట్లు పెంచామని ఆర్టీసీ తెలిపింది.

ఏపీలో చివరగా 2015 అక్టోబర్‌లో బస్సు ఛార్జీలు పెంచారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మోత మోగించారు. నష్టాల్లో కూరుకుపోతున్న సంస్థను కాపాడుకునేందుకే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ఎండీ కృష్ణబాబు తెలిపారు. వీలైనంత వరకు ప్రజలపై ఎక్కువ భారం పడకుండా చూశామని చెప్పారు.. ప్రయాణికులు అర్థం చేసుకొని..ఎప్పటిలాగే ఆర్టీసీని ఆదరించాలని కోరారు.

అటు ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ ఉద్యమ బాట పట్టింది.ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్నిచోట్లా ఆర్టీసీ బస్ డిపోల ముందు ధర్నాలు, నిరసనలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పెంచిన చార్జీల తగ్గింపును కోరుతూ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. సభా ప్రారంభానికి ముందు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద నిరసన నిర్వహించే అవకాశం ఉంది.

Tags

Next Story