బీజేపీతో కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహమిదే..

బీజేపీతో కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహమిదే..

cm-kcr

స్టేట్ లో పార్టీ టు పార్టీ లైన్. కేంద్రంతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ లైన్. బీజేపీతో కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహమిది. రాష్ట్రంలో బీజేపీని ప్రతిపక్షంగానే భావిస్తూ వచ్చింది టీఆర్ఎస్. అటు బీజేపీ కూడా అంశాల వారీగా ప్రభుత్వంతో లడాయి కొనసాగిస్తూనే వస్తోంది. అయితే..కేంద్రంతో మాత్రం సానుకూల ధోరణితో ఉండేది. అక్కడ సెంటర్ గవర్నమెంట్..ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. రెండు ప్రభుత్వాలు ప్రజోపయోగంగా ఉండాలన్ని కేసీఆర్ స్టాండ్. కేంద్రంతో సానుకూలంగా ఉంటూనే నిధులు రాబట్టుకోవాలనే నిరీక్షణ అయనది. అందుకే కేంద్రంలో బీజేపీ స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా టిఆరెస్ మ‌ద్ద‌తు తెలుపుతూ వచ్చింది. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, ఆర్టీకల్ 370 రద్దు, త్రిబుల్ త‌లాక్ ఇలా కీలకమైన బిల్లులకు మద్దతివ్వటంతో ఎన్డీయే పార్టీల కంటే ఓ అడుగు ముందే ఉన్నారు. బీజేపీతో రహస్య స్నేహమంటూ విమర్శలు వచ్చిన లెక్కచేయలేదు టీఆర్ఎస్.

మోడీ ప్రభుత్వానికి అన్ని అంశాల్లో దోస్తీ అంటూ ముందుకొచ్చిన టీఆర్ఎస్ స్టాండ్ మారింది. పౌరసత్వ బిల్లు విషయంలోనూ ఎన్డీయేకి వ్యతిరేకంగా ఓటు వేసింది టీఆర్ఎస్. దీనిక్కారణం తెలంగాణకు రావాల్సిన నిధుల జాప్యమే. ప‌న్నుల రూపంలో రాష్ట్రం నుంచి కేంద్ర ఖ‌జానాకు 40వేల కోట్లు రూపాయ‌లు వెళ్తున్నాయి. అన్ని రాష్ట్రాల‌కు ఇచ్చి న‌ట్టే ప‌న్నుల ఆదాయంలో 50శాతం వాటా నిధులు తెలంగాణ‌కు ఇవ్వాలి. కానీ, స‌గం కూడా ఇవ్వ‌డం లేద‌న్నది టీఆర్ఎస్ వాదన. పైగా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు జాతీయా హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిని కూడా కేంద్రం అస‌లు ప‌ట్టించుకోలేదు. ఇక ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన మిష‌న్ భ‌గీర‌ధకు 9 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార‌స్ చేసినా..కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదు.

ఎకానమీ అంశాలే కాదు..పొలిటిక‌ల్ గా కూడా బీజేపీతో టీఆర్ఎస్ కు కొన్నాళ్లుగా పొసగటం లేదు. ముంద‌స్తు ఎన్నిక‌ల నాటి నుంచే టీఆర్ఎస్ ను బీజేపీ టార్గెట్ చేసింది. అప్ప‌ట్లో కమలానికి మైలేజి రాక‌పోయినా ...లోక స‌భ ఎన్నిక‌ల‌తో రాష్ట్రంలో సీన్ మారింది. నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన నాటి నుంచి అధికార టిఆరెస్ ను బిజేపి టార్గెట్ చేసింది. రాబోయే ఎన్నికల్లోగా రాష్ట్రంలో పాగా వేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇదే క్ర‌మంలో కేంద్రం నుంచి అడ‌పా ద‌డ‌పా వస్తున్న బీజేపీ పెద్ద‌లు..కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదంటూ ఆరోపలు గుప్పిస్తున్నారు. దీంతో అసలు ఈ ఐదేళ్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని..ఇప్పటివరకు విడులైన నిధులెన్నో లెక్క తేల్చే పనిలో ఉంది టీఆర్ఎస్. బీజేపీ నేత‌లు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని చెప్పేందుకు కేసిఆర్ సిద్ద‌మైయ్యారు. అవ‌స‌ర‌మైతే అసెంబ్లీని ప్ర‌త్యేక స‌మావేశం పెట్టి కేంద్రం తీరును ఎండ‌గ‌ట్టాల‌నే యోచనలో ఉన్నారు. ఇప్పుడే సీన్ ఇలా ఉంటే రాబోయే రోజుల్లో కమలంతో గులాబీ కయ్యం రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story