ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నిరసనలు చేపట్టింది. ఎన్నికల ప్రచారంలో YCP ఇచ్చిన వాగ్దానాలకు, ప్రస్తుత పరిస్థితులకు పొంతనే లేదంటూ తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ సచివాలయం వద్ద చేపట్టిన ధర్నాలో చంద్రబాబు పాల్గొన్నారు. బాలకృష్ణ, లోకేష్ సహా పార్టీ సభ్యులంతా ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వం మెజార్టీ ఉందని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటోందని చంద్రబాబు మండిపడ్డారు.
అటు, మంగళగిరి బస్‌స్టాండ్ వద్ద టీడీపీ ఎమ్మెల్సీలంతా నిరసన చేపట్టారు. టికెట్ ఛార్జీలు పెంచాలన్న నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తర్వాత లోకేష్ సహా ఎమ్మెల్సీలంతా టికెట్లు కొనుక్కుని ఆర్టీసీ బస్‌లోనే అసెంబ్లీకి వచ్చారు. పెరిగిన ధరలపై ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఏటా ప్రజలపై 700 నుంచి 1000 కోట్ల భారం వేసేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తీరును తప్పుపట్టారు లోకేష్. పెంచుకుటూ పోతామని ఎన్నికల ప్రచారంలో జగన్ అంటే.. సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారని అనుకున్నారని తీరా చూస్తే అన్ని ధరలు పెంచుతున్నారని లోకేష్ విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com