చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణకు త్రిసభ్య కమిషన్‌

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణకు త్రిసభ్య కమిషన్‌

disha

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఆరు నెలల్లో దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కమిషన్‌కి ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్‌ వ్యవహరిస్తారు. అలాగే సభ్యులుగా బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎన్‌ రేఖ, మాజీ సీబీఐ డైరెక్టర్ కార్తికేయన్‌ ఉంటారు. విచారణ కమిషన్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించింది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఘటనలో పోలీసులు విచారణ ఎదుర్కోక తప్పదని బుధవారమే సుప్రీం కోర్టు చెప్పింది. గురువారం తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్ల వాదనల తర్వాత.. త్రిసభ్య కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించింది.

ఎన్‌కౌంటర్‌ కేసుపై గురువారం సుప్రీంలో 2వ రోజు వాదనలు వాడివేడిగా సాగాయి. పోలీసుల చర్యలపై ప్రత్యేక బృందం విచారణ తప్పదని చెప్పిన కోర్టు.. ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు జరిపినట్టుగా చెప్తున్న దానికి సాక్ష్యులు ఎవరని ప్రశ్నించింది. తాము ఆదేశించిన విచారణ కమిషన్ ముందు పోలీసులు హాజరవ్వాలని, సిట్ దర్యాప్తులో తేలిన అంశాలు కమిషన్‌కు సమర్పించాలని సూచించింది. ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించినా.. ఎదురుకాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితులు రేపిస్టులే అనడంలో ఎలాంటి అనుమానం లేదని.. పోలీసుల దగ్గర లాఠీలు లాక్కుని, రాళ్లు రువ్వి, పిస్తోలు కూడా లాక్కుని కాల్పులు జరిపారని రోహత్గీ చెప్పారు. ఐతే.. ఈ బుల్లెట్లు పోలీసులకు తగల్లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ బృందానికి కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద నిందితులను సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారని, నిందితులు వాళ్లే అనడంలో ఎలాంటి అనుమానం లేదని వివరించారు. NHRCతోపాటు సిట్ కూడా దర్యాప్తు చేస్తున్నందున త్రిసభ్య కమిషన్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వ విచారణ గురించి తాము అడగడం లేదని.. ఎన్‌కౌంటర్ ఫలితంపైనే మాట్లాడుతున్నామంది. త్రిసభ్య కమిషన్‌ హైదరాబాద్‌ నుంచే విచారణ మొదలుపెట్టి 6 నెలల్లో రిపోర్ట్ ఇస్తుందని తేల్చి చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story