గొల్లపూడి సినిమా స్క్రిప్ట్‌ని ఒక్క రాత్రిలోనే..

గొల్లపూడి సినిమా స్క్రిప్ట్‌ని ఒక్క రాత్రిలోనే..

gollapudi-maruthirao

1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి.. విద్యార్ధిగా ఉన్నప్పుడే రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తొలి దశలో కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కలాన్ని నమ్ముకునే జీవించాలనుకున్నారు. ఆంధ్రప్రభలో చేరారు. అట్నుంచి రేడియోకి విస్తరించారు. అలా పాఠకులనూ, శ్రోతలనూ ఏకకాలంలో ఆకట్టుకున్నారు. నాటక రచయితగానూ కళ్లు లాంటి ప్రయోగాత్మక రచనతో అవార్టులతో పాటు ప్రేక్షక హృదయాలనూ గెల్చుకున్నారు.

రచనా రంగంలో విజయపతాకం ఎగరేసిన గొల్లపూడి మారుతీరావు సహజంగానే దుక్కిపాటి మధుసూదనరావు దృష్టిని ఆకర్షించారు. ఆరెకపూడి కౌసల్యాదేవి రాసిన చక్రభ్రమణం నవల ఆధారంగా తెరకెక్కిన డాక్టర్ చక్రవర్తి సినిమాకు స్క్రీన్ ప్లే రచయితగా గొల్లపూడిని ఆహ్వానించారు దుక్కిపాటి. ఆ స్క్రీన్ ప్లే రచనకు గాను నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవం స్క్రిప్ట్ కు గాను మరోసారి నంది గొల్లపూడిని వరించింది. మారుతీరావు లో విపరీతమైన సాహితీ ధార ఉంది. రెండు రెళ్లు ఆరు, ప్రశ్నలాంటి నాటకాలు ఆయన కేవలం ఒక్క రాత్రిలోనే రాసేశారంటే నమ్మశక్యమా? సినిమా స్క్రిప్టు అయినా అంతే ఇలా చెపితే అలా రాసుకొచ్చేసేవారు. ఆత్రేయతో పడీ పడీ ఉన్న దుక్కిపాటి వారికి గొల్లపూడి స్పీడు నచ్చింది. అలా విశ్వనాథ్ తొలి చిత్రానికి పనిచేసిన గొల్లపూడి చాలా గ్యాప్ తర్వాత శుభలేఖ చిత్రానికి మాటలు రాశారు. అంకెల ఆదిశేషయ్య గా సత్యనారాయణ కారక్టర్ బాగా పండించారు.

అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పనిచేశారు గొల్లపూడి. క్రమశిక్షణ గల రచయితగా గొల్లపూడికి మంచి పేరుంది. ఎస్.డి లాల్ డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించిన అనేక సూపర్ హిట్ చిత్రాలకు గొల్లపూడి మారుతీరావే డైలాగ్స్ రాశారు. అన్నదమ్ముల అనుబంధం లాంటి సక్సస్ ఫుల్ చిత్రాలకు డైలాగ్స్ రాసి తన కలానికి మాస్ పల్స్ కూడా తెల్సుననిపించారు మారుతీరావు. రచయితగా పాపులర్ అయిన మారుతీరావు నటుడుగా టర్న్ తీసుకున్న తర్వాత చేసిన పాత్రల్లో హిట్లర్ రాఘవయ్య కాస్త ప్రత్యేకమైనది. త్రిశూలం చిత్రం రచయిత సత్యానంద్. అయినా అందులో ఓ సన్నివేశాన్ని మారుతీరావే రాసుకున్నారు. ఆ సన్నివేశం గురించి దర్శకుడు రాఘవేంద్రరావు తన సౌందర్యలహరిలో ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story