పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ముస్లీంలు నిరసన వ్యక్తం చేశారు. క్యాబ్‌కు వ్యతిరేకంగా పాతబస్తీలో నిరసన తెలిపారు. సైదాబాద్‌లోని మసీదులో ప్రార్థనలు జరిపిన అనంతరం ముస్లీం మత పెద్దలు నల్లజెండాలతో అక్బర్ బాగ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వందల మంది మైనార్టీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న పౌరసత్వ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ అటు గుంటూరు జిల్లా పొన్నూరులోనూ ముస్లీంలు, ప్రజా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎన్‌ఆర్‌సీ, క్యాబ్ చట్టాలను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ఉద్యమం ద్వారా ఎదుర్కొంటామని అన్నారు. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు.
ఖమ్మం జిల్లా వైరాలోనూ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్‌సీ వల్ల ముస్లీంలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. ఇతర దేశాలకు చెందిన ముస్లీంలకు కూడా ఈ చట్టాన్ని వర్తింప చేయాలని ముస్లీం మత పెద్దలు కోరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com