దిశ చట్టం.. అసెంబ్లీలో ఆమోదం

దిశ ఘటనతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై అత్యాచారాలను, లైంగిక దాడులను అరికట్టేందుకు.. దిశ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం దిశ చట్టాన్ని శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మహిళలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడేవారిపై ఈ చట్టం కఠినంగా వ్యవహరించనుంది. అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో 14 రోజుల్లోనే విచారణ పూర్తయ్యేలా ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. మొత్తం 21 రోజుల్లో రేప్ కేసుపై జడ్జిమెంట్ రానుంది.
బాధితులకు సత్వర న్యాయం చేసేందుకే దిశ చట్టాన్ని తీసుకొచ్చామన్నారు ఏపీ సీఎం జగన్. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని.. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. అత్యాచారాలకు పాల్పడ్డ నిందితులకు 21 రోజుల్లోనే మరణశిక్ష పడేలా దిశ చట్టాన్ని తీసుకొస్తున్నామన్నారు. చట్టాల్లో మార్పు వస్తేనే ప్రభుత్వాలను ప్రజలు నమ్ముతారన్నారు సీఎం జగన్.
సోషల్ మీడియా కారణంగా కూడా ఆడవాళ్లకు భద్రత లేకుండా పోయిందన్నారు సీఎం జగన్. దురదృష్టవశాత్తు అలాంటివాటికి ఇప్పటి వరకు చట్టం లేదని.. దానికి ఇప్పుడు చట్టం తీసుకొస్తున్నామని చెప్పారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారీ అదే నేరానికి పాల్పడితే నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తామన్నారు జగన్.
దిశ చట్టాన్ని స్వాగతిస్తున్నామన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. అయితే చట్టాలు తీసుకొస్తేనే సరిపోదని.. వాటిని సరిగ్గా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎంత గొప్పవారైనా తప్పు చేస్తే శిక్షించేలా ఉండాలన్నారు చంద్రబాబు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల గురించి చంద్రబాబు ప్రస్తావించడంతో..అటు అధికార పార్టీ సభ్యులు వనజాక్షి ఇష్యూను లేవనెత్తారు.
ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రత బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటలు పేలాయి. ముఖ్యంగా కొడాలి నాని తీరుపై అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వక్తం చేశారు. ఆయన్ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కొడాలి నాని. అచ్చెన్నాయుడ్ని పశువుల ఆస్పత్రిలో చేర్చాలని నాని విమర్శించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com