ఉల్లి కష్టాలు.. చాంతాడంత క్యూ లైన్‌లు..

ఉల్లి కష్టాలు..  చాంతాడంత క్యూ లైన్‌లు..
X

onion

ఉల్లి కోసం ఏపీలో జనాలు అష్ట కష్టాలు పడుతున్నారు. గతంలో ఉల్లి ధరలు స్వల్పంగా పెరిగినా.. కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్లీ నేలకు దిగొచ్చేవి. కానీ ఈసారి మాత్రం ఉల్లి ధర మాత్రం సామాన్యుడికి అసలు అందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం రైతు బజార్లకు జనం క్యూ కడుతున్నారు. దీంతో వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో రైతు బజార్లు ఉల్లి కోసం వచ్చిన వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి రైతు బజార్‌లో కిలో ఉల్లి 25 రూపాయలకే ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేయడంతో.. క్యూ కట్టారు. దీంతో ఏ రైతు బజారు చూసినా చాంతాడంతా క్యూలైన్లే దర్శనమిస్తున్నాయి. ఎండలో నిలబడలేక కొంత మంది వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు.

రోజంతా నిలబడ్డ కొందరికి ఉల్లిపాయలు మాత్రం దొరకడం లేదు. కూలి పని మానుకుని మరీ వస్తే ఉల్లిగడ్డలు దొరకడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో ఉల్లిపాయలు దొరికినా అవి నాణ్యత ఉండడం లేదని మరికొంత మంది వాపోతున్నారు.

రైతు బజార్లకు రావాలంటే ఇబ్బందులు వస్తున్నాయని.. రేషన్‌ షాపుల్లో ఉల్లిపాయలు ఇవ్వాలని.. లేదంటే గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు జనం. మరోవైపు రైతు బజార్లకు వచ్చే జనాలను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఒక్కో రైతు బజారు దగ్గర పది మందికిపైగా పోలీసులు పహారా కాస్తుండగా.. ఒక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story