రాహుల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీల డిమాండ్

అత్యాచారాల ఘటనలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో రగడ జరిగింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా కాదు.. రేప్ ఇన్ ఇండియా అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సభ ప్రారంభమవగానే.. రాహుల్ వ్యాఖ్యలపై మహిళా ఎంపీలు నిరసనలతో హోరెత్తించారు.
దేశంలోని మహిళల్ని రాహుల్ గాంధీ అవమానించారని మహిళా ఎంపీలు ఫైర్ అయ్యారు. రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ దేశానికిచ్చే సందేశం ఇదేనా అంటూ.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా.. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాను ప్రధాని మోదీ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంటే.. దాన్ని అత్యాచారాలతో పోల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులకు సభలో నైతికంగా సభలో ఉండే హక్కు లేదన్నారు.
రేప్ ఇన్ ఇండియా అంటూ తాను చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించుకున్నారు రాహుల్‌గాంధీ. తన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ఆందోళనల దృష్టిని మరల్చేందుకే... అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాహుల్ రివర్స్ ఎటాక్ చేశారు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రాహుల్‌గాంధీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com