ఉరితాడుకు వెన్నపూసి నిర్భయ దోషులను..

బ్రతకాలంటే ధైర్యం అక్కరలేదు కానీ.. చావాలంటే చాలా ధైర్యం కావాలి.. ఓ మనిషి ప్రాణం తీయాలంటే మనసు రాయి చేసుకోవాలి. కక్షలూ, కార్పణ్యాలతో కత్తులు దూస్తున్నారు కానీ.. ప్రాణం పోతున్నప్పుడు ఆ మనిషి పడే బాధ అనుభవంలోకి వస్తేనే అర్థమవుతుందేమో. నిర్భయ కేసులో దోషులు పట్టుబడి సంవత్సరాలు గడుస్తున్నా ఉరిశిక్షను అమలు చేయలేకపోతున్నారు. మనుషులు మృగాల్లా మార ఓ ఆడపిల్ల జీవితాన్ని అన్యాయంగా బలి తీసుకున్నారు. పాశవికంగా ప్రవర్తించి హత్యాచారం చేశారు. నిందితులను ఉరి తీయాలని దేశమంతా నినదించింది. కోర్టు తీర్పు చెప్పినా ఉరిశిక్షను అమలు చేయడంలో ఇంకా వెనుకాడుతున్నారు. ఎట్టకేలకు ఈనెల 17న నిందితుల మెడకు ఉరితాడు బిగియనుంది.
శిక్ష అమలు చేసేందుకు వీలుగా తీహార్ జైలులోని ఫాన్సీ కోటలో ఉరిశిక్ష విధించే కంట్రీయార్డును అధికారులు పరిశీలించారు. నిర్భయ నిందితులు ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్‌లకు త్వరలో ఉరి తీయడానికి తగిన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. తీహార్ జైలులో 1950వ సంవత్సరంలో నిర్మించిన రెండు కాంక్రీట్ పిల్లర్లకు మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేసి ఉంది. మెటల్ బార్ నలుగురు దోషుల బరువు ఆపుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు. అవసరమైతే ఉరి కొయ్యలు అమర్చేందుకు వీలుగా అదనంగా మరో మెటల్ క్రాస్ బార్ ఏర్పాటు చేయాలని అధికారులు అనుకుంటున్నారు. బీహార్ రాష్ట్రంలోని బక్సర్ సెంట్రల్ జైలు నుంచి తెప్పిస్తున్న 8 మనీలా ఉరితాళ్లు మృదువుగా, బలంగా ఉండేలా వీటి తయారీలో దూదిని కలిపారు. ఉరి తీయబోయే దోషులు తక్కువ నొప్పితో ప్రాణాలు విడిచేందుకు వీలుగా ఉరితాళ్లకు వెన్నపూయాలని తీహార్ జైలు అధికారులు నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com