అనంతపురంలో పోలీస్ స్టేషన్ ముందు స్థానికులు ధర్నా.. ఉద్రిక్త పరిస్థితులు..

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాల్తూరుకు చెందిన బోయ శ్రీనివాసులు అనే రైతు పోలీసుల దెబ్బలు తట్టుకోలేక మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసులు మృతదేహంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. రాత్రి జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసులును పోలీసులు పట్టుకెళ్లారు. అనంతరం అతడిని పోలీసులు విపరీతంగా కొట్టారని, ఆ దెబ్బలు తాళలేక శ్రీనివాసులు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
పొలం గట్టున నీటి విషయమై ఓబులేసు అనే వ్యక్తి కుటుంబ సభ్యులు.. శ్రీనివాసులుతో గొడవ పడినట్లు తెలుస్తోంది. మాట మాట పెరిగి ఇద్దరూ కొట్టుకున్నారు. ఇదే విషయమే ఓబులేసు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఇద్దరిని విచారణకు తీసుకెళ్లారు. అయితే పోలీసులు కొట్టడంతోనే తన భర్త చనిపోయాడని మృతుడి భార్య ఆరోపిస్తోంది. అర్ధరాత్రి పీఎస్ ముందు మృతదేహంతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com