పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. అసోం, మేఘాలయాల్లోనూ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయి. బెంగాల్లో ఆందోళనకారులు బెల్డంగ రైల్వే స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అటు ఢిల్లీలో జామియా వర్సిటీ విద్యార్ధుల నిరసనలు హింసాత్మకంగా మారింది.
పౌరసత్వ సవరణ చట్టంపై విద్యార్ధిలోకం భగ్గుమంది. ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ఢిల్లీలోని జేఎంఐ యూనివర్సిటీ విద్యార్ధులు ఈ వివాదస్పద చట్టంపై చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్లమెంట్ ముట్టడికి వెళ్తున్న విద్యార్ధులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. 50 మంది స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. పటేల్ చౌక్, జన్‌పత్ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.
అసోంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గురువారం లాఠీఛార్జీలో గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో దిబ్రూగఢ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మరిపోయాయి. అటు ఈ ఆందోళనల కారణంగా అసోంలో ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా.. 11 మందికి గాయాలయ్యాయి.
అటు పశ్చిమబెంగాల్‌లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బెల్ దంగా రైల్వేస్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్ని ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లించారు.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఆందోళనకారులు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీఛార్జిలో కొంత మంది గాయపడ్డారు. ఆందోళనల కారణంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా షిల్లాంగ్ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ ఆదివారం షిల్లాంగ్‌లోని పోలీస్ అకాడమీని సందర్శించాల్సి ఉంది. సోమవారం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించాల్సి ఉంది. మరోవైపు ఈ ఆందోళనలు విదేశీ మంత్రులు, ప్రతినిధుల పర్యటనపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. బంగ్లాదేశ్ మంత్రులతోపాటు.. జపాన్ ప్రధాని షింజో అబే పర్యటన కూడా వాయిదా పడింది.
క్యాబ్‌కు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో ముస్లీంలు నిరసన వ్యక్తం చేశారు. పాతబస్తీ సైదాబాద్‌లోని మసీదులో ప్రార్థనలు జరిపిన అనంతరం ముస్లీం మత పెద్దలు నల్లజెండాలతో అక్బర్ బాగ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వందల మంది మైనార్టీ యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న పౌరసత్వ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ అటు గుంటూరు జిల్లా పొన్నూరులోనూ ముస్లీంలు, ప్రజా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎన్‌ఆర్‌సీ, క్యాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం జిల్లా వైరాలోనూ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్‌సీ వల్ల ముస్లీంలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com