రైతుని కోటీశ్వరుడిగా మార్చిన ఉల్లిపంట

రైతుని కోటీశ్వరుడిగా మార్చిన ఉల్లిపంట
X

farme

ఉల్లిపాయలు కొనాలంటే రేటు చూసి వినియోగదారుల గుండె గుభేల్ మంటుంటే.. ఓ రైతుకు మాత్రం అదే ధర కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చిపెట్టింది. రాత్రికి రాత్రి అతన్ని కోటీశ్వరుడిని చేసేసింది. కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి చెందిన మల్లిఖార్జున.. 20 ఎకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. ఈసారి మార్కెట్‌లో విపరీతమైన రేటు ఉండడంతో అతని పంట పండింది. ఇప్పటివరకూ 240 టన్నులు అమ్మితే నాలుగున్నర కోట్ల వరకూ ఆదాయం వచ్చింది. అతను ఈ స్థాయిలో డబ్బు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో రేటు దాదాపు 200 వరకూ ఉండడం కలిసొచ్చింది. చుట్టుపక్కల మరికొందరు రైతులు కూడా ఉల్లి సాగుచేసినా ఎవరికీ ఇంతలా ఆదాయం రాలేదు. దిగుబడి బాగా ఉండడం, ధర కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఉండడంతో మల్లిఖార్జున సుడి తిరిగింది.

కొన్నేళ్లుగా ఉల్లి పంట మీద ఆదాయం పెద్దగా లేకపోవడంతో ఈసారి అప్పుచేసి మరీ పెట్టుబడి పెట్టాడు. తనకు ఉన్న పది ఎకరాల పొలంతోపాటు మరో పది ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. ఈసారి దశ తిరిగి నెల రోజుల్లోనే కోట్లకు పడగలెత్తాడు. ప్రస్తుతం తన అప్పులు తీరిపోయాయని, వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానని మల్లిఖార్జున చెప్తున్నాడు. అలాగే మరికొంత వ్యవసాయ పొలం కూడా కొనుక్కుంటానంటున్నాడు.

ఏటా ఉల్లి సాగు చేసినప్పుడు దిగుబడి బాగా వచ్చినా ఐదు లక్షలకు మించి మిగులు ఉండదని రైతు మల్లిఖార్జున చెప్తున్నాడు. ఈసారి కూడా 5 నుంచి 10 లక్షల మధ్యలో మిగిలితే చాలనుకున్నానని కానీ అనూహ్యంగా పెరిగిన రేట్లతో తన కుటుంబం దశ మారిపోయిందంటున్నాడు. ఇప్పటికి 20 లోడ్ల వరకూ ఉల్లిపాయలు అమ్మాడు. మిగతా పంటను కూడా అమ్మితే ఇంకొంచెం ఆదాయం అతని ఖాతాలో పడబోతోంది.

Tags

Next Story