విందుకు వెళ్లిన వైసీపీ ఎంపీకి కాపు సెగ

విందుకు వెళ్లిన వైసీపీ ఎంపీకి కాపు సెగ
X

ycp

విశాఖలోని కంబాల కొండలో జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనం అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారింది. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరవుతూ తన వెంట YCP MP విజయసాయిరెడ్డిని కూడా తీసుకెళ్లారు. వేదికపై ఆయనతో జ్యోతి ప్రజ్వలన చేయించారు. ఇది కాపులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కులాలవారీగా జరిగే వన భోజనాలైనా, మరో విందు సమావేశమైనా.. ఇతర సామాజిక వర్గాల వారు హాజరు కావడం సాధారణమే అయినా.. జ్యోతి ప్రజ్వలన లాంటివి కూడా వారితోనే చేయించడంపై కాపులు అభ్యంతరం తెలిపారు. పిలవని పేరంటానికి విజయసాయిరెడ్డి ఎలా వస్తారంటూ కొందరు గట్టిగానే ప్రశ్నించారు. జై కాపు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఊహించని ఈ పరిణామంతో మంత్రి అవంతితోపాటు, విజయసాయిరెడ్డి కూడా ఇబ్బంది పడ్డారు. కాపుల పిక్నిక్‌లో.. YCP వాళ్లకు ఏం పనంటూ విమర్శలు హోరెత్తడంతో నిరసన తెలుపుతున్న వాళ్లకు సర్ది చెప్పేందుకు నిర్వాహకులు ప్రయత్నించారు. కాపులు కాని వారిని వేదికపై నుంచి దింపాల్సిందేనంటూ నినాదాలు మరింత పెరగాయి. ఇంతలో మైక్ అందుకున్న విజయసాయిరెడ్డి అందరికీ సర్ది చెప్పబోయారు. తాను కూడా కాపునేనని, నెల్లూరు జిల్లాలో రెడ్లను కాపులుగా పిలుస్తారని చెప్పారు. తన పదవ తరగతి సర్టిఫికెట్ల్‌లో కాపు అనే ఉంటుందని చెప్పుకొచ్చారు.

కాపుల సమ్మేళనానికి విజయసాయిరెడ్డిని తీసుకొచ్చింది మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావే కావడంతో.. ఈ గొడవ వల్ల ఆయనకు తల కొట్టేసినట్టయ్యింది. విజయసాయిరెడ్డిని పంపించాక వేదికపై మాట్లాడిన మంత్రి.. జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫంక్షన్‌లో తన సహనం పరీక్షించడం మంచిది కాదన్నారు. ఐనా పలువురు నిరసన ఆపకపోవడంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

విశాఖలోని కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఒంటరి కులాల వాళ్ల ఆత్మీయ సమావేశం 'కాపునాడు' ఆధ్వర్యంలో జరిగింది. కంబాలకొడ వద్ద ఆదివారం ఉదయం 10 నుంచే సందడి కనిపించింది. ఈ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులంతా హాజరై.. ప్రసంగించారు. ఇంతలో మంత్రి అవంతితో కలిసి.. కొందరు YCP నేతలు ఫంక్షన్‌కి వచ్చారు. MP విజయసాయిరెడ్డి, VMRDA ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, మాజీ MLA మళ్ల విజయ్‌ ప్రసాద్ సహా మరిందరు వేదికపైన కూర్చున్నారు. ఇది కాపులకు ఆగ్రహం తెప్పించింది. తామంతా కాపుల పిక్నిక్ పెట్టుకుంటే చివరికి వైసీపీ మీటింగ్‌లా మార్చేశారంటూ నిరసన తెలిపారు. వైసీపీ విజయసాయిరెడ్డి జ్యోతిప్రజ్వలన చేయడంపై అభ్యంతరం తెలిపారు. జై కాపు అని నినాదాలు చేస్తూ.. వంగవీటి రంగా, గుడివాడ గురునాథరావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. మొత్తంగా మధ్యాహ్నం భోజనాల సమయంలో జరిగిన ఈ గొడవతో.. చాలా మంది తినకుండానే వెళ్లిపోయారు.

Tags

Next Story