ఆకాశమంత ఎత్తులో రామాలయం నిర్మిస్తాం : అమిత్ షా

ఆకాశమంత ఎత్తులో రామాలయం నిర్మిస్తాం : అమిత్ షా
X

amith-shah

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కౌంట్‌ డౌన్‌ ప్రారంభమయ్యింది. ఎన్నో ఏళ్లుగా అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయోధ్య వివాదానికి సుప్రీం కోర్టు ముగింపు పలకడంతో.. ఇక రామ మందిరమే తరువాయి అంటున్నారు కమలనాథులు. నాలుగు నెలల్లో రామాలయాన్ని నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణానికి అవాంతరాలు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిర్మించి తీరుతామన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాకూర్‌ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామజన్మభూమి వ్యవహారాన్ని ప్రస్తావించారు. మరో నాలుగు నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తులో రామాలయం నిర్మిస్తామని చెప్పారు.

అయోధ్య వివాదానికి సంబంధించి నవంబర్ 9న సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల భూభాగాన్ని రామజన్మభూమి న్యాస్‌కు కేటాయించింది. అక్కడే రామాలయం నిర్మించాల ని ఆదేశించింది. రామమందిరం నిర్మాణానికి 3 నెలల్లో అయోధ్య ట్రస్ట్ ఏర్పాటు చేయాలని సూచించింది. ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో 5 ఎకరాలు కేటాయించాలని నిర్దేశించింది.

అయోధ్యపై తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రామాలయ నిర్మాణాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్‌లు కూడా రామాలయ నిర్మాణంపైనే ఫోకస్ చేశారు.

Tags

Next Story