బయోడైవర్సిటీ పార్క్‌ ఫ్లైఓవర్ ప్రమాదాలపై నిపుణుల కమిటీ నివేదిక

బయోడైవర్సిటీ పార్క్‌ ఫ్లైఓవర్ ప్రమాదాలపై నిపుణుల కమిటీ నివేదిక
X

Biodiversity-Flyover

తీవ్ర బయాందోళనకు గురి చేసిన హైదరాబాద్‌ బయోడైవర్సిటీ పార్క్‌ ఫ్లైఓవర్ కారు ప్రమాదంపై నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. గంటకు 40 కిలోమీటర్ల వేగతంతో వెళితే ఇబ్బందేమి లేదని.. అంతకు మించిన వేగంతో వెళ్లకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని నిపుణుల కమిటీ సూచించింది. క్షేత్రస్థాయిలో వంతెన నిర్మాణం, ప్లాన్‌, డ్రాయింగ్‌, ఇతర సాంకేతిక అంశాల సుదీర్ఘ పరిశీలన అనంతరం కమిటీ సభ్యులు.. జీహెచ్‌ఎంసీకి నివేదిక అందించినట్లు తెలుస్తోంది.

నవంబర్‌ 23న బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి గంటలకు 105 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. చౌరస్తా వద్ద మలుపు తిరిగే క్రమంలో అదుపు తప్పి కింద రోడ్డుపై పడింది. దీంతో రోడ్డు పక్కన బస్టాప్‌ దగ్గర వేచి చూస్తున్న సత్యవేణిపై.. కారు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాల నేపథ్యవంలో ఫ్లైఓవర్‌ నిర్మాణంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తక్కువ దూరంలో రెండు షార్ప్‌ కర్వ్‌లు ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని.. డిజైన్‌లో లోపముందని రవాణా రంగ నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో ప్రమాదం జరిగిన రోజు నుంచే ఫ్లైఓవర్‌ను మూసేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మూడు లేన్లుగా ఉన్న వంతెనపై ఒకే వైపు వాహనాలు వెళ్లే అవకాశం ఉండడంతో ఫ్లైఓవర్‌ ఎక్కగానే వాహనాల వేగం పెరుగుతోంది. దీంతో మలుపు వద్ద వాహనాల వేగం నియంత్రణ కాక ప్రమాదాలకు దారితీస్తోంది.

వరుస ప్రమాదాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే‌ష్ కుమార్‌ రవాణా రంగ నిపుణులతో స్వతంత్ర కమిటీ నియమించారు. దాదాపు రెండు వారాలపాటు డిజైన్‌, ఇతర సాంకేతిక అంశాలను పరిశీలించిన సభ్యులు నివేదిక సమర్పించినట్టు సమాచారం. ఫ్లైఓవర్‌ ఎక్కే చోటు నుంచే వేగాన్ని అదుపు చేసేందుకు రంబుల్‌ స్ర్టిప్స్‌తో పాటు ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులకు కమిటీ నివేదించింది. పరిమిత వేగం, మలుపుల సమాచారం తెలిసేలా సూచిక బోర్డులు అవసరమని అందులో పేర్కొంది. వంతెనపై వాహనం నిర్ణీత వేగం దాటిన వెంటనే ఆటోమేటిక్‌గా యజమానికి చలానా సందేశం వెళ్లేలా చూడాలి. రెండు, మూడు ఉల్లంఘనల అనంతరం లైసెన్స్‌ రద్దు, వాహనం సీజ్‌ వంటి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నట్టు సమాచారం. ఇక స్పీడ్‌ బ్రేకర్ల నిర్మాణం నిబంధనలకు విరుద్ధం కనుక.. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ నిబంధనలకు లోబడే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది కమిటీ. నివేదికలో సూచించిన భద్రతా ఏర్పాట్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. ఏర్పాట్లు చేసిన అనంతరం సభ్యులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తేనే ఫ్లైఓవర్‌పై తిరిగి రాకపోకలకు అనుమతిస్తారు. మరో నాలుగైదు రోజుల్లో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

Tags

Next Story