ఉరిశిక్ష విధించబడిన రెండవ పాక్ అధ్యక్షుడు ముషారప్

ఉరిశిక్ష విధించబడిన రెండవ పాక్ అధ్యక్షుడు ముషారప్

musharaff

పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముషారఫ్‌ను ఉరి తీయాలంటూ లాహోర్‌ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయనపై గతంలో దేశద్రోహం కేసు నమోదైంది. ముషారఫ్‌పై నమోదైన కేసులను సుదీర్ఘంగా విచారించిన ముగ్గురు న్యాయమూర్తలు ధర్మాసనం ఆయన్ని దోషిగా తేల్చుతూ.. తీర్పును వెలువరించింది. అయితే మాజీ అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాక్‌ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా 1979లో ఉరి తీశారు.

ముషారఫ్‌ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా 2007 నవంబర్‌ 3న దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఈ సమయంలో దేశంలోని విపక్ష నేతలను, న్యాయమూర్తులను అక్రమంగా నిర్బంధించారు. అనేక మంది ఉన్నతాధికారులను, న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ఆయనపై 2013లో దేశద్రోహం కేసు నమోదైంది. కేసు విచారణ జరుగుతుండగానే 2016లో దేశం విడిచి వెళ్లిపోయారు. విచారణకు హాజరుకావాలని కోర్టు ఎన్నిసార్లు ఆదేశించినా ముషారఫ్‌ ధిక్కరించారు.

పర్వేజ్ ముషారఫ్‌ గత నాలుగేళ్లుగా దుబాయ్‌లో తలదాచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ముషారఫ్‌ను పాక్‌కు తీసుకువచ్చి ఉరి తీయడం అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. మరోవైపు లాహోర్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ -PML ప్రభుత్వం ముషారఫ్‌పై రాజద్రోహం కేసు నమోదు చేసింది. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి ఎమర్జెన్సీ పాలన విధించడంతో ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. ముషారఫ్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story