ఏపీకి 3 రాజధానుల సూత్రంతో వర్కౌట్ అవుతుందా?

ఏపీకి 3 రాజధానుల సూత్రంతో వర్కౌట్ అవుతుందా?
X

JAGAN

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైంది మొదలు..ఏపీ వేడిక్కిపోయింది. మిగిలిన రోజులన్ని ఒక ఎత్తు అయితే..సమావేశాల చివరి రోజు మాత్రం మరో ఎత్తు. రాజధానిపై సీఎం జగన్ అనూహ్య ప్రకటనతో ఏపీలో కూల్ వెదర్ కాస్తా హీటెక్కింది. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను కూడా కలుపుకొని మూడు రాజధానులు రావొచ్చునని సూచనాప్రాయంగా చెప్పారు. రావొచ్చని చెప్పినా..అలా జరిగే అవకాశాలే ఎక్కువ అనే సంకేతాలిచ్చారు. దీంతో రాజధాని ఒకే చోట విస్తృతంగా అభివృద్ధి చెంది మిగతా నగరాలకు పోటీ పడేలా ఉండాలా? అన్ని ప్రాంతాల్లో చిన్న చిన్క నగరాలుగా లిమిటెడ్ అభివృద్ధితో సరిపెట్టుకోవాలా అనేది ప్రస్తుతం చర్చకు తావిస్తోంది.

ఒక రాష్ట్రంలో మల్టిపుల్ రాజధానులతో ఎంత వరకు ప్రయోజనం అనేది కూడా జనంలో టాపిక్ పాయింట్ గా మారింది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ఇప్పుడు కొత్త విషయమేమి కాదు. మన దేశంలో ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పరిపాలన ఒక చోట హైకోర్టు మరో చోట ఉన్నాయి. గుజరాత్ లో గాంధీనగర్ అసెంబ్లీ, ఎగ్జిక్యూటీవ్ విభాగం ఉన్నాయి. అహ్మదాబాద్ లో హైకోర్టు ఉంది. కేరళ సచివాలయం, అసెంబ్లీ కూడా రాజధాని తిరువనంతపురంలోనే ఉన్నాయి. హైకోర్టు మాత్రం కొచ్చిలో ఉంది. ఇక మధ్యప్రదేశ్ లోనూ అంతే. అసెంబ్లీ, సచివాలయం భోపాల్ లో ఉన్నాయి. హైకోర్టును జబల్ పూర్ లో ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు మాత్రం సమ్మర్, వింటర్ కేపిటల్ ఉన్నాయి. సమ్మర్ కేపిటల్ గా ముంబై, వింటర్ కేపిటల్ గా నాగ్ పూర్ నుంచి పరిపాలన కొనసాగుతుంది. అయితే..నాగ్ పూర్ ను రెండో రాజధానిగానే పరిగణిస్తారు. ఒడిశా పరిపాలన రాజధాని భువనేశ్వర్ నుంచే కొనసాగుతుంది.కటక్ లో హైకోర్టును ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లోనూ కేపిటల్ సిటీ జైపూర్ లోనే అసెంబ్లీ, సచివాలయం ఉన్నాయి. హైకోర్టు జోధ్ పూర్ లో ఉంది. చత్తీస్ గఢ్ అసెంబ్లీ, సెక్రటరీయేట్ ను కేపిటల్ సిటీ రాయపూర్ లో ఏర్పాటు చేశారు. హైకోర్ట మాత్రం బిలాస్ పూర్ లో ఉంది.

ఈ ఏడు రాష్ట్రాల్లో మహారాష్ట్ర లో మినహా మిగిలిన రాష్ట్రాల్లో పరిపాలన వికేంద్రీకరణ హైకోర్టు వరకే పరిమితం అయింది. అన్ని చోట్ల లెజిస్లేటీవ్, ఎగ్జిక్యూటీవ్ విభాగాలు ఒకే నగరంలో ఉన్నాయి. పైగా ఆయా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ భౌగోళిక పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఏపీ భౌగోళికంగా పొడవుగా విస్తరించిన రాష్ట్రం. దీంతో అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండేలా అమరావతిని రాజధానిగా సెలక్ట్ చేశారు. అయితే..అసెంబ్లీ అమరావతిలో ఉండి ఎగ్జిక్యూటీవ్ కేపిటల్ విశాఖలో ఉంటే అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం ఎలా కుదురుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు దూరాభారం తప్పదు. అదే సమయంలో విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే.. సీమ జిల్లాలకు దూరం పెరుగుతుంది అనేది విపక్షాల వాదన. పరిపాలన వికేంద్రీకరణకు బదులు పరిశ్రమలు, ఐటీ అన్ని ప్రాంతాలకు విస్తరించేలా అభివృద్ధి వికేంద్రీరణ జరగాలని అంటున్నారు.

Tags

Next Story