ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్న ఆందోళనలు

ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్న ఆందోళనలు
X

caa-protest

ఈశాన్యం ఇంకా నివురుగప్పిన నిప్పులానే ఉంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. హింసాత్మక ఘటనలు అదుపులోకి వచ్చినప్పటికీ నిరసనలు మాత్రం జరుగుతున్నాయి. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వందల మందిని అరెస్టు చేశారు. సుమారు 3 వేల మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులపై 136 కేసులు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి విడిచిపెడుతున్నారు.

అసోంలో అల్లర్లను అణిచివేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం పరిస్థితులను అదుపులో ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు. హింసాత్మక ఘటనలు సద్దుమణగడంతో దిబ్రూఘర్, షిల్లాంగ్‌లలో కర్ఫ్యూను సడలించారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ధర్నాలు, రాస్తారోకోలు, రైలు రోకోలతో ఆందోళనకారులు ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా-పౌర హక్కుల సంఘాల కార్యకర్తలు ఉమ్మడిగా పోరాటం నిర్వహిస్తారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరసనలు హోరెత్తుతున్నాయి. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించింది.

చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరువణ్ణామలై, కాట్పాడి, ఆంబూరు ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలు, రైలురోకోలు నిర్వహించారు. చెన్నైలో మద్రాసు ఐఐటీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. కోయంబత్తూరు, మధురైలలో భారతీయ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు. తిరువణ్ణామలైలో ప్రభుత్వ కళాశాలలకు చెందిన విద్యార్థులు తరగతులు బహిష్కరించి రాస్తారోకో జరిపారు.

Tags

Next Story