తాడో పేడో తేల్చుకునేందుకు డిసైడ్ అయిన టీమిండియా..

ట్రైమ్యాచ్ సీరిస్ లో భారత్ - విండీస్ కీలక మ్యాచ్ రెడీ అయింది. ఫస్ట్ వన్డేలో అనూహ్యంగా విండీస్ చేతిలో ఓడిపోయిన టీమిండియా..విశాఖ పిచ్ పై ఇక తాడో పేడో తేల్చుకునేందుకు డిసైడ్ అయ్యింది. సిరీస్ లో నిలబడాలంటే విశాఖలో భారత్ తప్పని సరిగా గెలవాల్సిందే. పన్నెండేళ్లుగా విండీస్ పై సిరీస్ ఓడిపోని కోహ్లీ గ్యాంగ్ కు బుధవారం మ్యాచ్ సవాల్ గా మారింది. అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా కాపాడుకోవాలని చూస్తోంది టీమిండియా. అటు విండీస్ కూడా సెకండ్ వన్డేలోనే గెలిచి సిరీస్ గెల్చుకోవాలని చూస్తోంది.
చెన్నై వన్డేలో ఓటమితో సహజంగానే టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. చెన్నై మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమవడంతో పాటు నలుగురు ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగి భారత్ భంగపడింది. దీనికి తోడు బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కూడా ఫస్ట్ వన్డేలో ఓటమికి కారణమైంది. అయితే..ఈసారి లోపాలను సరిచేసుకుంటూ సిరీస్‌లో నిలిచే ఆటతీరును ప్రదర్శించాలనుకుంటోంది. అయితే..విశాఖలో కోహ్లీ ట్రాక్ రికార్డ్ టీమిండియాలో ఉత్సాహం నింపుతోంది. విశాఖ స్టేడియంలో వరుసగా ఐదు వన్డేల్లో మూడు సెంచరీలు.. రెండు అర్ధసెంచరీలు చేశాడు కోహ్లీ. ఓవరాల్‌గా ఈవేదికపై 139 సగటుతో 556 పరుగులు సాధించాడు.
విండీస్ టీం హెట్‌మెయిర్ ఫాం టీమిండియా బౌలర్లకు పరీక్షగా మారింది. అతి తక్కువ ఇన్నింగ్స్ లో ఐదు సెంచరీలు చేసి రికార్డ్ క్రియేట్ చేసిన హెట్ మెయిర్ కు తోడు ఓపెనర్ హోప్ కూడా ఫాంలో ఉండటం విండీస్ టీంకు ప్లస్ పాయింట్. విండీస్, టీమిండియా మధ్య కీలక మ్యాచ్ కావటంతో విశాఖ తీరం క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది.
కోల్ కతాలో గురువారం ఐపీఎల్ వేలం పాట జరగబోతోంది. సరిగ్గా ఆక్షన్ కు ముందు రోజే విశాఖ వన్డే జరుగుతోంది. దీంతో వేలంలో తమ వేయిట్ పెంచుకునేందుకు కూడా విశాఖ వన్డే వేదిక కానుంది. విశాఖలో రఫ్పాడిస్తే వేలం పాటలో డిమాండ్ పెరుగుతుందని ఆటగాళ్లు భావిస్తున్నారు.
Tags
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com