కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ తేదీ ఖరారు

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు భేటీ తేదీ ఖరారు
X

krishna-river

రెండు సార్లు వాయిదా పడిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని వచ్చేనెల 8వ తేదీన నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం అందించింది. ఈ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించనున్నది. హైదరాబాద్ నుంచి బోర్డు కార్యాలయ తరలింపు కసరత్తు వేగవంతమైన నేపథ్యంలో.. విజయవాడలో బోర్డు భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ, వినియోగానికి సంబంధించి స్పష్టత కోసం గత నెల 27న సమావేశాన్ని నిర్వహించనున్నట్టు బోర్డు రెండు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ఆ రోజు తమకు వీలు కాదని, డిసెంబర్ మొదటివారంలో నిర్వహించాలని ఏపీ ఈఎన్సీ కోరడంతో డిసెంబరు 3న నిర్వహించనున్నట్టు బోర్డు సమాచారమిచ్చింది.

ఐతే.. డిసెంబరు 3న సమావేశాన్నీ వాయిదావేయాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలు కోరారు. తాజాగా మూడోసారి భేటీ తేదీని ఖరారు చేశారు. గత రెండు పర్యాయాలు హైదరాబాద్‌లో సమావేశం ఉంటుందని తెలుపగా.. ఇప్పుడు మాత్రం విజయవాడకు మార్చారు. విజయవాడలో బోర్డుకార్యాలయ భవనం ఖరారుకాకపోవడంతో సమావేశాన్ని ప్రైవేటు హోటల్‌లో నిర్వహించే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రాలకు రాసిన లేఖల్లో వేదికను పేర్కొనలేదు.

వచ్చేనెల జరుగనున్న బోర్డు సమావేశంలో నాలుగు అంశాలు ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది. కృష్ణా జలాల్లో తాజా సంవత్సరానికి రెండు రాష్ట్రాల వాటా, ఇప్పటివరకు వినియోగంపై సుదీర్ఘంగా చర్చించే అవకాశముంది. ముఖ్యంగా ఏపీ వాటా కంటే అత్యధికంగా నీటిని వాడుకున్నందున.. ఆ లెక్కలను ఎలా సరిచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాది ఆగస్టు వరకు తాగునీటి అవసరాల పంపిణీ, ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీల ఏర్పాటు అంశాలపై చర్చించనున్నారు. బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించే అంశంపైనా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. తెలంగాణ తరపున సాంకేతిక సభ్యుడిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్‌రావు, ఇతర ఇంజినీర్లు సమావేవానికి హాజరుకానున్నారు.

Tags

Next Story