అందులో వచ్చే ఆదాయం కంటే అదనంగా మరో 3 వేల కోట్లు!

తెలంగాణలో గడిచిన 5ఏళ్లుగా భూముల ధరలు భారీగా పెరిగాయి. ఐనా రిజిస్ట్రేషన్ల ధరలను మాత్రం పెంచలేదు. వాస్తవానికి ఏటా భూముల రేట్లు పెరిగినట్టే స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్‌ల రుసుములనూ పెంచాల్సి ఉంది. ధరలు పెంచాల్సిందిగా రిజిస్ట్రేషన్లశాఖ చాలాసార్లు ప్రభుత్వాన్ని కోరింది. చివరగా ఉమ్మడి రాష్ట్రంలో 2013లో రిజిస్ట్రేషన్ రేట్లు పెంచారు. ధరల పెంపుపై గత కేబినెట్ సమావేశంలోనూ చర్చించారు. పూర్తిస్థాయిలో సమీక్షించారు. స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ ల ద్వారా ఏటా 6 వేల 200కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఇక 5 ఏళ్లుగా భూముల క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి కాబట్టి రిజిస్ట్రేషన్ల ధరలు కూడా పెంచాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. పకడ్బందీగా, మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
భూముల ధరల పెంపుపై ఇప్పటికే కసరత్తు మొదలైంది..రియల్టర్లతో కూడా చర్చలు జరిపారు అధికారులు. ప్రతిపాదనలతో త్వరలో సీఎంకు నోట్ కూడా ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో త్రిసభ్య కమిటీలు వేయనున్నారు. కమిటీ సభ్యులుగా జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ రిజిస్ట్రార్లు, సబ్ కలెక్టర్లు ఉంటారు...కమిటీల సిఫారసు మేరకు సగటున కనీసం 25శాతం భూముల ధరలు పెరగనున్నాయి. పెంచిన రేట్లను రెవెన్యూ శాఖ నోటిఫై చేయనుంది.ప్రభుత్వ, మార్కెట్ ధరల మధ్య తేడా ఆధారంగా కమర్షియల్, అర్బన్, రూరల్ భూముల ధరలు 10 నుంచి 100% వరకు పెరిగే అవకాశముంది. ఈ ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీ పెరగనున్నాయి. పెరగనున్న కొత్త రేట్లతో సర్కారు వచ్చే ఆదాయం భారీగా పెరగనుంది.. ఇప్పుడు వచ్చే ఆదాయం కంటే అదనంగా మరో 3 వేల కోట్ల వస్తాయని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com