సీఎం జగన్ ప్రకటన : సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన రైతులు


అమరావతిలో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో బంద్ చేస్తోన్న రైతులు..... తక్షణమే సీఎం జగన్.. తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉదయం రాస్తారోకో చేసిన రాజధాని రైతులు.. సెక్రటేరిట్ ముట్టడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
రాజధాని కోసం తమ విలువైన భూములు పణంగా పెట్టామని, ఇప్పుడు సీఎం జగన్ మోసం చేస్తున్నారంటూ ఆగ్రహిస్తున్నారు రైతులు. తూళ్లూరు, మందడం, వెలగపూడి, కొరగల్లు, నీరుకొండ, రాయపూడి గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ రాకపోకలను అడ్డుకున్నారు. పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. సచివాలయానికి వెళ్లే రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వెంకటపాలెం వద్ద బస్సులు నిలిపేశారు. 3 కిలోమీటర్లు నడిచి సెక్రటెరియట్‌కు చేరుకున్నారు సచివాలయ ఉద్యోగులు.
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో... భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడిక్కడ రైతుల్ని అడ్డుకుంటున్నారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందన్న పోలీసులు... చట్టాన్ని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 10మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

