సీఎం జగన్ ప్రకటనతో రాజధాని రైతులు ఆందోళన.. 29 గ్రామాల్లో బంద్..


ఏపీకి మూడు రాజధానులుంటాయంటూ సీఎం జగన్ ప్రకటనతో రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. గురువారం రాజధాని 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చారు రాజధాని రైతులు. పాఠశాలలు, వ్యాపారసంస్థ, హోటళ్లు బంద్ చేస్తున్నాయి. వెలగపూడిలో రిలే నిరాహరదీక్ష ప్రారంభించనున్నారు రైతులు, రైతు కూలీలు.
రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనపై అమరావతి రైతుల నిరసన గళం ఇది. మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం.. రోగం వస్తే చికిత్స ఒక చోట, పరీక్షలు మరో చోట, మందులు వేరే చోట తెచ్చుకున్నట్లు ఉందని.. అలా చేస్తే రోగి చనిపోతాడనేది రాజధాని అమరావతి ప్రాంతవాసుల మాట. వెలగపూడి, వెంకటపాలెంలో నిరాహార దీక్షలు చేపట్టిన రైతులు.. మందడంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సమావేశమైన రైతులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో భాగంగా అమరావతి బంద్‌కు పిలుపునిచ్చారు. కేపిటల్ ఏరియాలోని 29 గ్రామాల్లో బంద్ చేపట్టనున్నారు.. అలాగే అన్ని గ్రామాల్లోని గ్రామ సచివాలయాల వద్ద నిరసనలు తెలుపనున్నారు. రైతులంతా రోడ్లపైకి రావాలని నిర్ణయించారు. గురువారం ఉదయం నుంచి వెలగపూడిలో రిలే దీక్షలు చేపట్టనున్నారు.
రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని.. రాజధాని మార్చడమంటే మోదీని అవమానపర్చినట్టే అన్నారు రైతులు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ, పరిపాలన వికేంద్రీకరణ వద్దని నినదించారు. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడాన్ని జగన్ కూడా అసెంబ్లీలో సమర్థించారని గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం.. భవిష్యత్ తరాల బాగు కోసం.. సదుద్దేశంతో భూములు ఇచ్చామని, ఇప్పుడు అభివృద్ధిని మధ్యలో వదిలేస్తే ఎలా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
3 రాజధానులపై రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ ప్రజలు విభిన్నంగా స్పందిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో వచ్చే లాభం ఏమీ లేదని, రెండో రాజధానిగా చేస్తే రాయలసీమ వాసులకు ప్రయోజనం ఉంటుందన్న డిమాండ్ కూడా తెరపైకి వస్తోంది.
గురువారం అమరావతి బంద్‌తో పాటు.. రైతులు ఆందోళనలను ఉధృతం చేయనున్నారు. నిరసన దీక్షలకూ సిద్ధమయ్యారు. 3 రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి ప్రాంత రైతులకు నిద్రాహారాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

