తీవ్ర దుమారం రేపుతోన్న మూడు రాజధానుల ప్రకటన

అంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ఇప్పుడు రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. స్వయంగా సీఎం జగనే 3 రాజధానుల ప్రతిపాదన తేవడంతో పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. గతంలో అమరావతిని సమర్ధించిన జగన్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని టీడీపీ నిలదీస్తోంది. హైదరాబాద్‌లోని తన ఆస్తులు కాపాడుకునేందుకు ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలో వైసీపీ నాయకులు భూములు కొనిపెట్టుకున్నారని అందుకే.. రాజధాని అక్కడికి మార్చారని విమర్శించారు..
టీడీపీ విమర్శలను మంత్రులు తిప్పికొట్టారు. సీఎం జగన్ మాటల్ని చంద్రబాబు వక్రీకరిస్తున్నారు విమర్శించారు . రాజధాని ప్రాంత రైతులు టీడీపీ, జనసేన ట్రాప్‌లో పడొద్దని సూచించారు. రాజధానిపై కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం కూడా అదే విషయం చెప్పారని గుర్తు చేశారు.
సీఎం జగన్ ప్రకటన గందరగోళానికి దారి తీసిందని ఆరోపించింది బీజేపీ. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేస్తారని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. రాజధాని నిర్ణయం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలని డిమాండ్ చేశారు..
మూడు రాజధానుల ప్రతిపాదనపై జనసేన ఆందోళనకు సిద్ధమవుతోంది.పవన్ కళ్యాణ్ కూడా త్వరలో రాజధాని ప్రాంతంలో పర్యటించాలని భావిస్తున్నారు. అయితే ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం సీఎం జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల ఫార్ములాతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు.
మొత్తానికి రాజధాని అంశం పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపింది. పార్టీల వారీగా ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు. అటు అమరావతి ప్రాంత రైతులు మాత్రం తమను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com