మహిళలపై దాడులను ఎదుర్కొనేందుకు వినూత్న ప్రయత్నం

మహిళలపై దాడులను ఎదుర్కొనేందుకు వినూత్న ప్రయత్నం
X

KKK

కలరి పయట్టు.. భారతదేశంలో అతి ప్రాచీన యుద్ధకళ. శత్రువులను అత్యంత చాకచక్యంతో ఎదుర్కొనే ఈ పురాతన యుద్ధ విద్య.. ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టింది. వినూత్న ప్రయోగాల్లో ముందుండే పెద్దపల్లి కలెక్టర్ దేవసేన.. 3వ శతాబ్దం నాటి ఈ యుద్ధకళను జిల్లాల్లో ప్రవేశపెట్టారు. నిర్భయ, దిశ, సమత వంటి ఘటనల నేపథ్యంలో.. విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. దాడులను సమర్థవంతంగా ఎదర్కొనేందుకు కలరి పయట్టు యుద్ధకళలోని మెళకువలు నేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో బాలికలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు.

భారతదేశంలో ఒకప్పుడు గురుకులాల్లో విద్యాభ్యాసంతో పాటు యుద్దకళలను కూడా భోదించేవారు. వాటిలో అతి ప్రాచీనమైన యుద్ద కళ కలరి పయట్టు. ప్రపంచంలోనే తొలి యుద్ధ కళగా కలరి పయట్టుకు పేరుంది. మార్షల్ ఆర్ట్స్, కరాటే, కుంగ్ ఫూ, తైక్వాండో వంటి యుద్ధ విద్యల్లో వుండే మెళకువలన్నీ కలరి పయట్టులోనూ వుంటాయి.

కలరి పయట్టు కేరళలో శతాబ్దాల క్రితమే పాపులరయిన యుద్ధ కళ. ఈ యుద్ధ కళలో సుమారు 12 రకాల ఎక్సర్ సైజులు ఉంటాయి. బేసిక్ ఎక్సర్ సైజులతో పాటు కత్తి, కర్ర, డాలు వంటి ఆయుధాలతో పోరాటం చేసే విధంగా కలరిపయట్టులో శిక్షణ ఇస్తారు. కలరి పయట్టులో సెల్ఫ్ డిఫెన్స్ కు అత్యంత ప్రధానమైన అంశం. కలరి పయట్టులో ఆయుధాలతోనే కాదు, ఆయుధాలు లేకుండా నిర్వహించే పోటీలు కూడా వుంటాయి. శరీరం, మెదడు మధ్య సమన్వయం సాధించడమే ఈ ప్రాచీన యుద్ధకళ ప్రధాన లక్ష్యం.

దాడిని మెరుపువేగంతో అడ్డుకోడానికి కలరిపయట్టును మించిన యుద్ధ విద్య లేదు. ఈ యుద్ధ కళలో శిక్షణ పొందితే శరీర కదలికలతో పాటు.. దాడిని అడ్డుకోవడం ఎలాగో కూడా నేర్చుకోవచ్చు. అందుకే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన కలరిపయట్టు యుద్ధ కళలను బాలికలకు నేర్పిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో కలరి పయట్టులో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న సుమారు 12 వేల మంది విద్యార్థులకు ఈ ప్రాచీన యుద్ధ కళను నేర్చుకుంటారు.

దిశ లాంటి ఘటనల నుంచి తమను తాము రక్షించకోవడానికి.. కలరి పయట్టు ఉపయోగపడుతుందంటున్నారు పెద్దపల్లి కలెక్టర్ దేవసేన. కలరి పయట్టు శిక్షణ కోసం కేరళ నుంచి వచ్చిన 30 మంది ట్రైనర్లను రప్పించారు. ఒక్కో విద్యార్థికి 22 రోజుల పాటు రోజుకు రెండు గంటల శిక్షణ ఇస్తారు. ఇలా 45 రోజుల్లో శిక్షణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దేవసేన నిర్ణయించారు.

సాధారణంగా కలరి పయట్టులో కర్ర, కత్తి, డాలు వంటి ఆయుధాలతో శిక్షణ ఇస్తుంటారు. కానీ, జిల్లాలో మాత్రం చేతులు, కర్రలతో ట్రైనింగ్ ఇస్తున్నారు. దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకునే విధంగా మెళకువలు నేర్పిస్తున్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలను నిరోధించేందుకు మార్షల్ ఆర్ట్స్ కంటే కళరిపయట్టు ఎంతో మెరుగైన యుద్ధకళ.

ఆడపిల్లల రక్షణ కోసం ఇలాంటి యుద్ద కళలతో పాటు.. పురుషుల్లో సైతం మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భావిస్తున్నారు. మగవాళ్లలో మార్పు అనే చర్చ మొదలైతే.. ఆ చర్య వారిలో మార్పుకు ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ దేవసేన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story