కోరిక తీర్చాలని మహిళపై ఎస్‌ఐ లైంగిక వేధింపులు


మహిళలకు రక్షణగా ఉండాల్సిన ఆ ఖాకీనే.. బాధ్యతలను మరిచి మృగాడిగా మారాడు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధిత మహిళనే తన కోరిక తీర్చాలని లైంగికంగా వేధించాడు. ఈఘటన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో చోటు చేసుకుంది.
చిన్నగూడూరుకు చెందిన రజిత.. తన భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల దగ్గరే జీవితాన్ని గడుపుతోంది. అయితే చిన్నగూడూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ నరేష్ దగ్గర పని చేస్తున్న ఓ మహిళతో.. రజితకు, ఆమె తల్లికి మధ్య గొడవలున్నాయి. ఎస్‌ఐ దగ్గర పని చేస్తున్నాననే కారణంతో రజితతో దురుసుగా ప్రవర్తించేంది. దీంతో రజిత పోలీసుకు ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదును స్వీకరించి బాధితురాలికి న్యాయం చేయాల్సిన ఆ ఎస్‌ఐ.. తమ పని మనిషి మీద పెట్టిన కేసు పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు న్యాయం కోసం డీఎస్పీని ఆశ్రయించింది. డీఎస్పీ మందలించడంతో ఎస్‌ఐ దగ్గరకు చేరుకుని కేసు పెట్టమని మరోసారి అభ్యర్థించారు. దీంతో ఆగ్రహించిన సదరు ఎస్‌ఐ నరేష్.. తనపైనే ఫిర్యాదు చేస్తావా అని బెదిరించాడు. భర్త లేడుకదా.. తన కోరిక తీరిస్తే పని మనిషిపై కేసు పెడతానంటూ వేధింపులకు దిగాడు. ఎస్‌ఐ తీరుపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
మండలంలో జరిగే ఇసుక అక్రమ రవాణాలోనూ ఎస్‌ఐ నరేష్ హస్తం ఉందన్న ఆరోపణలు విపిస్తున్నాయి. నిత్యం తన పరిధిలో వంద ఇసుక ట్రాక్టర్లు నడుస్తుంటాయి. నెలకు ఒక ట్రాక్టర్ 10 వేలు కట్టాల్సిందేనని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఎస్‌ఐ నరేష్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ సైతం మందలించినట్లు తెలుస్తోంది. అక్రమాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఎస్‌ఐపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

