దేశ వ్యాప్తంగా నిరసనల వెల్లువ.. మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

‘పౌర’ ఆగ్రహం తీవ్రమవుతోంది. ఆందోళనలపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి పలు పట్టణాలు, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. యూపీ, బిహార్‌ల్లో ఆందోళనలు హింసాత్మకమయ్యాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. గత కొన్ని రోజులుగా యూపీ, గుజరాత్, కర్నాటక, బెంగాల్ సహా.. పలు రాష్ట్రాలు అట్టుడికిపోతున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇప్పటికే పలువురు మరణించారు. యూపీ, కర్నాటకల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపేశారు. ఇదిలావుంటే, అసోంలో మాత్రం ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. ఢిల్లీ మెట్రో సేవలు కూడా పాక్షికంగా ప్రారంభమయ్యాయి.
సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రంగా నిలిచిన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కేరళ, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీసీఏకు సంబంధించి నిబంధనలు, విధివిధానాలు పూర్తిగా ఖరారు కాలేదని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ విద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత చట్టం నిబంధనలపై ప్రతీ ఒక్కరితో చర్చించి.. అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు గురించి కేంద్రం సత్వరమే ఎటువంటి చర్యలు తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com