శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి

శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి
X

ramnath

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 28 వరకు రామ్‌నాథ్‌ కోవింద్‌ పర్యటన కొనసాగనుందని రాష్ట్రపతి భవన్‌ పేర్కొంది. పర్యటనలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్రపతి పర్యటిస్తారు. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాష్ట్రపతి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1గంటకు హైదరాబాద్‌లోని హకీంపేట చేరుకుంటారు. అక్కడ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు.. రాష్ట్రపతికి సాదర స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్ నాథ్ కోవింద్‌ చేరుకుంటారు.

పర్యటనలో భాగంగా ఈనెల 22న రాజ్‌భవన్‌లో రెడ్ క్రాస్ సొసైటీ.. తెలంగాణ బ్రాంచ్ మొబైల్ యాప్‌ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు. రాష్ట్రపతి గౌరవార్థం 22న రాత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విందు ఇస్తారు. 23న పుదుచ్చేరిని కోవింద్ సందర్శించనున్నారు. అక్కడి నుంచి 25న కన్యాకుమారిలోని వివేకానంద రాక్‌ మెమోరియల్‌, వివేకానంద కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 27న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం నిర్వహిస్తారు. 28న మధ్యాహ్నం రాష్ట్రపతి కోవింద్‌ ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రపతి నగరంలో ఉన్నన్ని రోజులూ అన్నిశాఖలూ సమన్వయంతో పనిచేయాలని కోరారు గవర్నర్‌.

Tags

Next Story