జీఎన్ రావు కమిటీ నివేదికతో.. ఉగ్రరూపం దాల్చిన అమరావతి రైతులు


భవిష్యత్ బాగుటందని ఆశపడ్డారు. బతుకునిచ్చే పచ్చని పంటపొలాలను కూడా నవ్యాంధ్ర రాజధాని కోసం త్యాగం చేశారు. పైసా తీసుకోకుండా అప్పటి ప్రభుత్వానికి అప్పగించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఇక్కడి రైతుల త్యాగం బూడిదలో పోసిన పన్నీరైంది. రాజధానితో పాటే మేము అభివృద్ధి చెందుతామని కన్న కలలన్ని రాజధాని తరిలింపుతోనే కొట్టుకుపోయాయి. 3 రాజధానులు అంటూ సీఎం ప్రతిపాదించగానే ఇక్కడి రైతులు బతుకుపోరు బాటపట్టారు. ఆ గుండెమంట రగులుతుండగానే GN రావు కమిటీ ఇచ్చిన నివేదకతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
జీఎన్ రావు కమిటీ నివేదికను వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు కమిటీ సభ్యుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయటంతో గందరగోళం ఏర్పడింది. పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చారు. ప్రొక్లయిన్‌ను రోడ్డుకు అడ్డంగా పెట్టి.. కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సచివాలయానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ స్తంభించింది.
సచివాలయం వద్ద కట్టిన ముఖ్యమంత్రి బ్యానర్లను చించేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత సచివాలయం-మందడం వై జంక్షన్ దగ్గర మెరుపు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి కమిటీ సభ్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీఎన్‌రావు కమిటీ సభ్యులు ఉన్నారేమోనన్న అనుమానంతో వచ్చేపోయే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు రైతులు.
కమిటీ సభ్యులను నిలదీసేందుకు సచివాలయం వైపుగా దూసుకెళ్లారు రైతులు. పోలీసులు బ్యారీకేడ్లను ఏర్పాటు చేసినా వాటిని తొలగించి సెక్రటరియేట్ వైపు పరుగులు తీయటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. కమిటీ రిపోర్ట్ రాకముందే అసెంబ్లీలో సీఎం ఎలా ప్రకటన చేయగలిగారని ప్రశ్నిస్తున్నారు.
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన తమ అభిప్రాయాలను ఎందుకు పరిగణలోకి తీసుకోరని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి రైతులు. GN రావు కమిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో వరద ముంపు వస్తుందంటున్నారని.. మరి విశాఖకు తుఫాను ముప్పు ఉండదా అంటూ నిలదీశారు.
తాము భూములు ఇచ్చింది పార్టీలకు కాదని.. ప్రభుత్వానికి అని అంటున్నారు రైతులు. తమ కుటుంబాలు కూడా రాష్ట్ర ప్రజల్లో భాగమేనని అంటున్నారు. మమ్మల్ని బజారున పడేయొద్దని అంటున్నారు.
సీఎంకు కావాల్సిన విధంగానే కమిటీ నివేదిక ఉందని ఆందోళనకు దిగిన రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేసి ఇదే ఏపీ రాజధాని ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఎలా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

