యూపీ నుంచి కర్నాటక వరకు.. ఢిల్లీ నుంచి చెన్నై వరకు నిరసనల హోరు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది. యూపీ నుంచి కర్నాటక వరకు.. ఢిల్లీ నుంచి చెన్నై వరకు నిరసనలు హోరెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ఆందోళనకారుల ప్రదర్శనలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. వందల మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇక, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న యూపీలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన ఐదురుగురు ఇవాళ చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 11 కు చేరింది. అయితే, యూపీ డీజీపీ ఓ పీ సింగ్ మాత్రం.. అసలు ఆందోళనకారులపై పోలీసులు ఒక్క బుల్లెట్ కూడా లేదన్నారు.
ఇక, నిన్న పోలీసుల కళ్లుగప్పి.. ఢిల్లీలోని జామా మసీద్ వద్ద ఆందోళన నిర్వహించిన.. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక, నిన్న వేలాదిమందితో అట్టుడికిన జామా మసీద్ ప్రాంతం వద్ద ఇవాళ ఉద్రిక్తతలు సద్దుమణిగాయి.
ఇదిలావుంటే, ఆందోళనలు దక్షిణ భారతానికి కూడా పాకాయి. చెన్నైలో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో బారికేడ్లు కూల్చేసి.. ఆందోళనకారులు స్టేషన్ లోకి దూసుకువెళ్లారు.
అటు, ఆర్జేడీ బీహార్ బంద్ కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పాట్నా సహా ప్రధాన నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఆర్జేడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పార్టీ జండాలు చేతబట్టి.. దాడులు చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరోవైపు మహారాష్ట్రలోనూ ఆందోళనలు మిన్నంటాయి. ఇప్పటివరకు 130 మందికి పైగా ఆందోళనకారులపై పోలీసులు కేసులు బుక్ చేశారు. ఆందోళన నిర్వహిస్తున్న నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు రైల్వే శాఖ కొంపముంచాయి. ఆందోళనకారులు రైళ్లు, రైల్వే స్టేషన్లపై ప్రతాపం చూపిస్తుండటంతో.. రైల్వే శాఖకు భారీ ఆస్తినష్టం వాటిల్లింది. సీఏఏ వ్యతిరేక నిరసనల వల్ల ఇప్పటివరకు 88 కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్టు ఆ శాఖ ప్రకటించింది.
ఇదిలావుంటే, అసోంలో మాత్రం పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. అక్కడ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com