రాజధాని రగడ.. ఒక్కొక్కరిది ఒక్కో వాదన..


ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ కొనసాగుతోంది. రాజధానిని మూడు ముక్కలు చేయడం భావ్యం కాదని.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప రాజధానుల వికేంద్రీకరణ కాదన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. రైతులు ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాలు రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే మౌలిక వసతుల కోసం 9 వేల కోట్లు ఖర్చు చేశామని.. ఈ తరుణంలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ విశాఖలో పెట్టాలని కమిటీ సూచించడం దారుణమన్నారు.
విశాఖలో రెండు రోడ్లు వేసినంత మాత్రాన రాజధాని అవుతుందా అని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. విశాఖను ఆర్థికంగా నాశనం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. వైఎస్ విజయలక్ష్మి వైజాగ్‌లో పోటీ చేస్తే అత్యంత ప్రమాదకరమని సబ్బం హరి అప్పుడే అన్నారని గుర్తు చేశారు. వైజాగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో వైసీపీ నేతలు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.
జీఎన్ రావ్ కమిటీతో రాయలసీమకు 60 శాతం మాత్రమే న్యాయం జరిగిందన్నారు బీజేపీ నేత, ఎంపీ టీజీ వెంకటేష్. విశాఖలో సెక్రటేరియట్ ప్రకటించినందున.. ఏపీకి అదే ప్రధాన రాజధాని అవుతుందని అభిప్రాయపడ్డారు. కర్నూల్‌లో హైకోర్టు ప్రకటించినా.. మినీ రాజధాని కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ కోసం కర్నూల్ నుంచి విశాఖ వెళ్లాలంటే వెయ్యి కిలో మీటర్ల దూరం ప్రయాణించాలన్నారు.
అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుతామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్‌లను ఇస్తామని.. గత ప్రభుత్వ హామీలు నెరవేర్చుతామని తెలిపారు. లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మించే స్థితిలో ప్రభుత్వం లేదని స్పష్టం చేశారు. రాజధాని కమిటీలో అందరూ అవగాహన ఉన్న నిపుణులే ఉన్నారని.. అన్నీ పరిశీలించే రిపోర్ట్ ఇచ్చినట్లు చెప్పారు. నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్ అన్న బొత్స.. క్యాబినెట్‌లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మొత్తానికి అమరావతే ఏపీ క్యాపిటల్ అన్న భ్రమలు తొలగిపోయాయి. రాజధానిని మూడు ముక్కలు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

