ఉత్కంఠ వీడింది.. జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చింది


ఉత్కంఠ వీడింది. రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను అందజేసింది. దాదాపు 3 నెలల పాటు రాష్ట్రంలో పర్యటించి.. వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి తుది రిపోర్టును రూపొందించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు రీజియన్లుగా చూడాలని సూచించింది GN రావు కమిటీ. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ రీజియన్లుగా రాష్ట్రాన్ని విభజించాలని అభిప్రాయపడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉత్తర కోస్తా రీజియన్‌లో ఉంటాయి. మధ్య కోస్తా ప్రాంతంలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు ఉంటాయి.. దక్షిణ కోస్తా రీజియన్‌లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉంటాయి.. ఇక కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు రాయలసీమ రీజియన్‌లో ఉంటాయి.
ఏయే ప్రాంతాల్లో ఏయే ప్రభుత్వ విభాగాలు ఉండాలనే అంశంపైనా కమిటీ కీలక సూచనలు చేసింది. కమిటీ నివేదిక ప్రకారం ప్రస్తుత అమరావతి ప్రాంతంలో అసెంబ్లీ, రాజ్‌భవన్, మినిస్టర్స్, అధికారుల క్వార్టర్లు, హైకోర్టు బెంచ్ ఉంటాయి. అంటే అమరావతి లెజిస్లేటివ్ కేపిటల్‌గా ఉంటుంది. తుళ్లూరు ప్రాంతాన్ని ఇప్పటికే అభివృద్ధి జరిగినందున ఆ ప్రాంతంలోని భవనాలను వినియోగించుకోవచ్చని సూచించింది. ఇక విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్, వేసవి అసెంబ్లీ సమావేశాలు, హైకోర్టు బెంచ్ ఉంటాయి. అంటే.. విశాఖ కీలకమైన ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా మారనుంది. శ్రీబాగ్ ఒప్పందం ఆధారంగా కర్నూలులో హైకోర్టు, అనుబంధ సంస్థలు ఏర్పాటు చేయాలని GNరావు కమిటీ సూచించింది. అంటే కర్నూలు జ్యూడిషియల్ కేపిటల్‌గా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతం, నదులు, అడవులు ఉన్నాయని.. అయితే అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా సూచనలు చేశామని చెప్పింది కమిటీ. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడింది. డెవలప్‌మెంట్ అంటే పర్యావరణాన్ని పాడు చేసుకోవడం కాదని చెప్పింది. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొనే సూచనలు చేశామని GNరావు తెలిపారు. రాష్ట్రమంతా పర్యటించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నివేదిక రూపొందించామని చెప్పారు GNరావు. రైతులతో మాట్లడలేదన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తనను చాలా మంది రైతులు కలిసి వారి అభిప్రాయాలను వెల్లడించినట్లు తెలిపారు. తమ వద్ద తీసుకున్న భూములను తిరిగి అప్పగించాలని మెజార్టీ రైతులు కోరినట్లు చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అమరావతి భవితవ్యాన్ని తేల్చేందుకు నిపుణుల కమిటీని నియమించింది ప్రభుత్వం. సెప్టెంబర్ 13న జీఎన్ రావు నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. మొత్తం 8 మంది సభ్యులున్నారు. రాష్ట్రంలో పర్యటించిన కమిటీ సభ్యులు విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధిని పరిశీలించారు. ఎక్కడ ఏది అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలన జరిపింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన 40వేలకు పైగా వినతులను పరిశీలించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

