పల్లె ప్రగతి కార్యక్రమం కోసం జనవరి ఒకటి నుంచి రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్స్

పల్లె ప్రగతి కార్యక్రమం పనితీరును పరిశీలించేందుకు జనవరి ఒకటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో చేపట్టిన పనుల పురోగతిని ఈ స్క్వాడ్స్ తనిఖీచేసి ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నాయి. పల్లె ప్రగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు భాగస్వామ్యం పంచుకోవడం శుభపరిణామ మన్నారు. అయితే...ప్రజలు చూపిస్తున్నంత ఉత్సాహాన్ని అధికారులు ప్రజా ప్రతినిధులు చూపించడం లేదనే ఫిర్యాదులు, సూచనలు క్షేత్ర స్థాయినుంచి అందుతున్నాయని సీఎం చెప్పారు..
IAS, IPS, IFS ఈ మూడు క్యాడర్లనుంచి ఉన్నతాధికారులను నియమించి తనిఖీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు...ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి అధికారికి రాండమ్ పద్దతిలో వివిధ జిల్లాల్లోని 12 మండలాల బాధ్యతలను అప్పగిస్తామన్నారు. ఎవరికి ఏమండలాన్ని అప్పగిస్తామనేది ప్రభుత్వంగోప్యంగా వుంచుతుందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో అలసత్వం వహిస్తే అధికారులు, సర్పంచుల మీద చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేశారు..
ఇచ్చిన మాట ప్రకారం పల్లె ప్రగతి కోసం.. ప్రతినెలా 339 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తున్నదని చెప్పారు సీఎం.పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించే దిశగా జిల్లా కలెక్టర్లను నిరంతరం అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఇన్ని రకాల చర్యలు తీసుకున్న తర్వాత కూడా పల్లెల్లో ప్రగతి అనుకున్నవిధంగా జరగకపోతే అందుకు కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులదే బాద్యత అని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com