ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి

ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి
X

amaravati

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు. రాజధాని ప్రాంత జనాల నినాదం ఇది. ఐదు రోజులుగా ఆందోళనలతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి రాజధాని ఐక్య కార్యచరణ సమితి..తమ ఉద్యమ కార్యచరణ ప్రకటించింది. ఈ రోజు కృష్ణాయపాలెంలో వంటావార్పు చేపట్టనుంది. ఆ తర్వాత తుళ్లూరులో మమాధర్నా..వెలగపూడిలో రిలే నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ ఆందోళనను గవర్నర్ కు విన్నవించాలని నిర్ణయించారు. రేపు గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు రైతులు. రైతుల ఆందోళనలకు న్యాయవాదులు కూడా మద్దతుగా నిలబడతామంటున్నారు. విజయవాడలో సమావేశమైన ఆరు జిల్లాల న్యాయవాదులు హైకోర్టును అమరావతిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27 కేబినెట్ మీటింగ్ ఉండటంతో అప్పటివరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని కార్యచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఇవాళ నిరసన ర్యాలీలు, 24న ఛలో హైకోర్టు, 26న ప్రకాశం బ్యారేజీ దగ్గర రైతులు, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

మరోవైపు ఐదో రోజున కూడా ఆందోళనలు మిన్నంటాయి. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన రైతులు..మందడంలో ప్రధాన రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై అడ్డంగా పడవను పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.రోడ్డుపై టెంటు వేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంటు ఇస్తే నోటీసులు ఇస్తామని షామియానా వాళ్లను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ..ఎండలోనే ధర్నా కొనసాగించారు..

అమరావతి మార్పునకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సచివాలయం ముట్టడికి ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.

రాజధాని ప్రాంత రైతుల త్యాగాలు వృథాకావని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తుళ్లూరులో నిర్వహిస్తున్న ధర్నాకు మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర మద్దతు తెలిపారు. వారితో సహా దీక్షలో పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రైతులకు మద్దతు తెలపాలని కోరారు..

గుంటూరు జిల్లా మోతడకలో రైతులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.. జీఎన్‌రావు కమిటీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు..కమిటీ తమ అభిప్రాయాలు తీసుకోలేదంటూ మండిపడ్డారు.

రాజధాని గ్రామాల్లో 600 మందికిపైగా పోలీసులను మోహరించారు. సచివాలయానికి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు..

ఏపీ అమరావతే రాజధానిగా ఉండాలని హిందూమహాసభ తీర్మానం చేసింది. ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను అమలు చేస్తే ఆందోళనలు ముమ్మరం చేస్తామని హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ..డా. ఇందిరా హెచ్చరించారు.

రాజధాని మార్పు అంశం ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించింది.. అమరావతినిలోని 29 గ్రామాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయిు. ప్రభుత్వం దిగొచ్చేవరకు ఆందోళనలు విరమించేది లేదంటున్నారు రైతులు.

Tags

Next Story