అమరావతిలో ఆందోళనలు.. మమ్మల్ని హత్య చేసి రాజధాని తరలించాలంటున్న రైతులు

అమరావతిలో ఆందోళనలు.. మమ్మల్ని హత్య చేసి రాజధాని తరలించాలంటున్న రైతులు
X

protest

అమరావతి నుంచి రాజధాని తరలింపుపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అమరావతి ప్రాంతంలో 6వ రోజు నిరసనలు ఉధృతమయ్యాయి. రాజధాని పరిసరాల్లో 29 గ్రామాల్లో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీక్షలు, ర్యాలీలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే తాము ప్రాణార్పణకు కూడా సిద్ధమన్నారు. ఇక్కడి రైతులను హత్య చేసిన తరువాత రాజధానిని తరలించాలి అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తుళ్లూరులో రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తాము పండించిన పంటలను చూపిస్తూ నిరసన తెలిపారు. మహాధర్నాలో రైతు దినోత్సవం సందర్భంగా రాజధానిలో పండే పంటలని దీక్ష వద్ద పెట్టిన రైతులు.. మిరప, పత్తి మొక్కలు ధరించి నిరసన తెలిపారు.

ఉదయం నుంచి తుళ్లూరులో పరిస్థితి ఉద్రిక్తంగానే కనిపించింది. రోడ్డుపై టెంట్‌ వేయకుండా అడ్డుకోవడంతో.. పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం ఘర్షణ చోటుచేసుకుంది. ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న రైతులు.. రోడ్డుపై టెంట్‌ వేసుకుని నిరసనలు కొనసాగించారు.

అటు మందడంలోనూ రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. భిక్షాటన చేపట్టారు. పోలీసుల్ని, సచివాలయం వెళ్లే ఉద్యోగులను ఆపి బిచ్చం అడిగి నిరసన తెలిపారు. రాజధాని ప్రాంతాన్ని స్పీకర్ ఎడారితో పోల్చారంటూ వారు మండిపడ్డారు.

పెనుమాకలోని బొడ్రాయి కూడలిలో రైతులు ధర్నాకు దిగారు. తాడి కొండలో రైతుల ఆధ్వర్యంలో ర్యాలీ జరగింది. మంగళగిరి, నిడుమర్రు, బేతపూడిలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి.

అమరావతికి మద్దతుగా గుంటూరు జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు తెలపారు.

బెజవాడ కోర్టు దగ్గర న్యాయవాదులు ఆందోళనకు దిగారు. కర్నూలుకు హైకోర్టు తరలించడాన్ని వాళ్లంతా తీవ్రంగా వ్యతిరేకించారు. బెజవాడ బార్‌కౌన్సిల్‌ సభ్యులంతా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ప్రభుత్వ దుర్మార్గాన్ని అవసరమైతే జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లాలని రాజధాని రైతులు భావిస్తున్నారు. తమ గోడు చెప్పుకునేందుకు.. గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ను కోరానున్నారు. మరోవైపు శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కూడా కలవాలని నిర్ణయించారు.

వారం రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోగా.. గందరగోళ ప్రకటనలు చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రైతులు.

Tags

Next Story