24 Dec 2019 2:49 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / మళ్లీ బలం...

మళ్లీ బలం పెంచుకుంటున్న ఉగ్రవాదులు

మళ్లీ బలం పెంచుకుంటున్న ఉగ్రవాదులు
X

terrసరిగ్గా రెండు నెలల క్రితం.. నాటి ఐసిస్ చీఫ్.. కరుడుగట్టిన ఉగ్రవాది అబు బకర్ అల్ బగ్దాదీని.. అమెరికా సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటనతో సిరియా, ఇరాక్ సహా ప్రపంచ దేశాలన్నీ ఊపిరిపీల్చుకున్నాయి. అయితే, ఆ వెంటనే కొత్త నాయకుడిని ఎన్నుకుంది ఐసిస్ ఉగ్రముఠా. కొత్త చీఫ్ వచ్చీరాగానే ఐసిస్ ను మళ్లీ బలోపేతం చేయడంపై దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో తమకు పట్టున్న ఇరాక్, సిరియాల్లో బలపడేందుకు ఐసిస్ ప్రయత్నాలు మెదలుపెట్టినట్టు సమాచారం.

తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన కుర్దిష్ అధికారి కీలక వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఐసిస్ మళ్లీ పుంజుకుంటోందని.. అల్-ఖైదా కంటే పవర్ ఫుల్ గా మారుతోందని.. కుర్దిష్ ఉగ్రవాద నిరోధక అధికారి లాహూర్ తలబానీ అన్నారు.

ఐసిస్ ఇప్పుడు కొత్త పద్దతులు, వ్యూహాలతో ముందుకెళ్తోందని తెలిపారు. అంతేకాదు, ఐసిస్ మూకల వద్ద ఇంకా పెద్ద ఎత్తున డబ్బుందని అన్నారు. అందుకే వారు వాహనాలు, ఆయుధాలు, ఆహార సామాగ్రిని కొనగలుగుతున్నారని.. సాంకేతికంగా వారు ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. వారి వ్యూహాలను ఇప్పుడు బయటకు తీయడం చాలా కష్టమని తెలిపారు.

అల్-ఖైదాలో వారి పూర్వీకుల మాదిరిగానే.. ప్రస్తుతం ఐసిస్ ఉగ్రవాదులు హామ్రిన్ పర్వతాల్లోని గుహల్లో తలదాచుకున్నారని.. పర్వత ప్రాంతాల నుంచి వారు కార్యాకలాపాలను కొనసాగించే అవకాశం ఉందని తలబానీ అన్నారు. ఉత్తర ఇరాక్‌ లో కుర్దు పెష్మెర్గా ఆధీనంలో వున్న ప్రాంతానికి, ఇరాక్ సైనిక స్థావరాలకు మధ్య.. సైనిక ప్రభావం లేని పర్వతప్రాంతం వుంది. ఈ ప్రాంతాన్ని పహారా కాస్తున్న ఏకైక శక్తి ఐసిస్ అని చెబుతున్నారు తలబానీ.

గ్రేట్ జాబ్ - టైగ్రిస్ నదుల మధ్య గల డెల్టాలో ఐసిస్ శాశ్వత స్థావరం ఏర్పరుచుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టైగ్రిస్ నది సమీపంలో ఉన్న ప్రాంతంలో ఐసిస్ కార్యకలాపాలు చాలా అధికంగా ఉన్నాయి. ఐసిస్ కదలికలను, కార్యకలాపాలను తాము ప్రతి రోజూ చూస్తున్నామని తలబానీ చెబుతున్నారు.

పేష్మెర్గా నిఘా నివేదికల ప్రకారం.. సిరియా సరిహద్దు దాటి వచ్చిన సుమారు 100 మంది ఫైటర్లతో ఐసిస్ శ్రేణులు ఇటీవల బలోపేతమయ్యాయి. వారిలో ఆత్మాహుతి బెల్టులు ధరించిన కొందరు విదేశీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2020 లో ఐసిస్ మరింత శక్తిమంతం కావడం ఖాయమని కుర్దిష్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఐసిస్ పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తోందని.. కానీ ఈసారి ఇరాక్, కుర్దు భద్రతా బలగాల నుంచి విభిన్నమైన ప్రతిస్పందనను ఎదుర్కొంటోందని ఇరాక్‌లో ఉన్న అమెరికా సైన్యం భరోసా ఇస్తోంది. ఐసిస్ కు దీటుగా సమాధానం చెబుతామని అమెరికా టాస్క్ ఫోర్స్ ఇరాక్ ఉన్నత స్థాయి కమాండర్లు చెబుతున్నారు.

ఐసిస్ 2014లో ఇరాక్‌లోని మూడో వంతు భూభాగాన్ని నియంత్రణలోకి తెచ్చుకుని, రెండో అతి పెద్ద నగరం మోసుల్‌ని పెద్దగా ప్రతిఘటన లేకుండా స్వాధీనం చేసుకున్నప్పటికన్నా.. ఇప్పుడు ఈ సైనిక బలగాలు మరింత సన్నద్ధతతో ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా.. నరరూప రాక్షసుల్లాంటి ఐసిస్ ఉగ్రమూకలు మళ్లీ బలోపేతమైతే.. సిరియా, ఇరాక్ లకే కాదు.. ప్రపంచానికే పెను ప్రమాదం.

Next Story