పోలీసుల నిర్బంధంలో అమరావతి!

పోలీసుల నిర్బంధంలో అమరావతి!
X

amaravathi

అమరావతిని పోలీసులు పుర్తిగా తమ నిర్బంధంలోకి తీసుకోనున్నారా? న్యాయం కోసం నినధిస్తున్న రైతులపై ఆంక్షల ఉక్కుపాదం మోపనున్నారా? తాజాగా తుళ్లూరు డీఎస్పీ ఇచ్చిన నోటీసులు చూస్తే అలాగే అనిపిస్తోంది. అమరావతి భవితవ్యాన్ని తేల్చనున్న రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఈ నెల 27న జరగనుంది. రాజధానిపై GNరావు కమిటీ ఇచ్చిన నివేదికపైనే ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో రాజధాని ప్రాంత గ్రామాల్లో భారీగా ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 29 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. అమరావతి కోసం ఉద్యమబాట పట్టారు. ఈ సమయంలో కేబినెట్ మీటింగ్‌ పేరుతో పోలీసులు ఆంక్షలు విధించడం కలకలం రేపుతోంది.

మొదట కేబినెట్ సమావేశం విశాఖలో నిర్వహిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అమరావతిలోనే జరుగుతుండటంతో.. మందడం గ్రామంలో ఆంక్షలు విధించారు పోలీసులు. రైతుల నివాసాల్లో కుటుంబ సభ్యులు మినహా కొత్త వారు ఎవరూ కనిపించకూడదంటూ కొత్త రూల్స్‌ పెట్టారు. ఇప్పటికే గ్రామానికి చెందిన రైతులకు నోటీసులు ఇచ్చినట్లు తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త వ్యక్తులు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సచివాలయానికి ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లే మార్గంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి 3 రాజధానులు రావచ్చని సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించడం.. ఆ తర్వాత GN రావు కమిటీ కూడా అదే విషయాన్ని చెప్పడంతో అమరావతి భగ్గుమంటోంది. 8 రోజులుగా రైతులు రోడ్కెక్కారు. నిరసనలు, ఆందోళనలు, దీక్షలతో 29 గ్రామాలు హోరెత్తుతున్నాయి. 3 రాజధానులు వద్దు-అమరావతే ముద్దు అంటూ ప్రజలంతా రోడ్లెక్కి నినదిస్తున్నారు. కేబినెట్‌ సమావేశం జరిగే సమయంలో రైతులు సీఎం కాన్వాయ్, మంత్రుల వాహనాలను అడ్డుకుంటే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని భావించిన పోలీసులు.. అమరావతిని ఆంక్షల పేరుతో నిర్బంధిస్తున్నారు.

Tags

Next Story