అమరావతిని రాజధానిగా సమర్ధించిన జగన్‌ ఇప్పుడు ఎందుకు మాట మార్చారు : రైతులు

అమరావతిని రాజధానిగా సమర్ధించిన జగన్‌ ఇప్పుడు ఎందుకు మాట మార్చారు : రైతులు
X

amaravati

అమరావతి నుంచి రాజధాని తరలింపును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో అమరావతిని రాజధానిగా సమర్ధించిన జగన్‌ ఇప్పుడు ఎందుకు మాట మార్చారని నిలదీస్తున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం నిరూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తాము స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఇప్పుడు తమ పొట్టకొట్టడం ఎంతవరకు సమంజసం అని నిలదీస్తున్నారు. రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తే ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడం అంటున్నారు.

కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని అమరావతి రైతులు కలిశారు. రాజధాని తరలింపుపై తమ బాధలు చెప్పుకున్నారు. మహిళలు కన్నీరు పెట్టారు. తాను రాజ్యాంగ పదవిలో ఉన్నందున రాజకీయాల గురించి మాట్లాడలేనని వెంకయ్య నాయుడు అన్నారు. అమరావతికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన విషయం, రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చిన విషయం తనకు తెలుసన్నారు. ఏపీకి తన వంతు ఏమి చేయాలో చేస్తానంటూ వెంకయ్య హామీ ఇచ్చారు. రైతుల నుంచి వినతిపత్రం స్వీకరించారు. మీ గోడు ఎక్కడ, ఎవరికి చెప్పాలో అక్కడ చెప్తానంటూ రాజధాని రైతులకు ఉపరాష్ట్రపతి భరోసా ఇచ్చారు.

రాజధాని రైతులకు మద్దతుగా మంగళగిరిలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొన్నారు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు, రైతు కూలీలు, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్.. అధికారంలోకి రాగానే మాట తప్పి..మడమ తిప్పారని లోకేష్‌ ఆరోపించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలన్నదే జగన్ ఎత్తుగడని ఆరోపించారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

రాజధాని ప్రాంతానికి చెందిన ఐనవోలు రైతులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. తమ సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిరసన కార్యక్రమాలపైనా ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అనే నినాదంతో ఆందోళన చేపట్టారు. మానవ హారంగా ఏర్పడ్డారు. (ONG TDP DHARNA) మూడు రాజధానుల ఆలోచనను వ్యతిరేకిస్తూ వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాజధానిపై సీఎం జగన్‌ కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.. బూటకపు కమిటీలు వేసి తనకు అనుకూలంగా నివేదికలు తయారు చేయించుకున్నారని ఆరోపించారు.

విజయవాడ ఎన్టీఆర్‌ సర్కిల్‌లో రాజధాని రైతులకు మద్దతుగా కాగడాల ప్రదర్శన నిర్వహించారు.. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో కాగడాలు పట్టుకుని టీడీపీ నేతలు నిరసన తెలిపారు.. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో లాయర్లు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపట్టారు.ఇప్పటికే హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చారని మళ్లీ ఇప్పుడు కర్నూలుకు అంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. 3 రాజధానుల అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇప్పటికైనా నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Tags

Next Story